ఈతరం భారతం హైద్రాబాద్ మే 19 :
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అలానే ఈ ఘటనలో ప్రియుడి మోజులో పడి తన ఆరేళ్ల బిడ్డను హతమార్చిందో తల్లి.మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా, తల్లే హత్య చేసినట్లు తేలింది.
నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి భూమ్మీదకు తీసుకొచ్చిన తన ప్రతిరూపాన్ని ఏ తల్లైనా ఛిదిమేస్తుందా? పిల్లలకు చిన్న గాయమైతేనే కన్నపేగు విలవిల్లాడుతుంది. కానీ కొందరు తల్లులు తమ కడుపున పుట్టిన బిడ్డలనే కడతేర్చుతున్నారు. అది కూడా ముక్కుపచ్చలారని పసివాళ్లను. భర్త వదిలేడంతో తప్పటడుగులు వేసిన ఓ మహిళ, అనైతిక బంధం మత్తులో మునిగి మానవత్వాన్నే మరిచింది. పేగు తెంచుకున్న బిడ్డ అని కూడా చూడలేదు. అభంశుభం ఎరుగని ప్రాయమని కనికరించలేదు. లాలించి, పాలించి, దీవించాల్సిన తల్లే బిడ్డను కిరాతకంగా కడతేర్చింది.
ట్యాంక్లో పడేసి – నిండుగా నింపేసి : ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆరేళ్ల తన్వికను మేడపైకి తీసుకెళ్లింది. కనికరం లేకుండా ఆ చిన్నారిని నీటి ట్యాంకులో పడేసింది. ప్రాణాల కోసం ఆ పాప గిలగిలా కొట్టుకుంటున్నా ఆ తల్లి గుండె కరగలేదు. ట్యాంక్ మూతపెట్టి, అందులో పూర్తిగా నీళ్లు నింపి అత్యంత కిరాతకంగా హత్య చేసింది. ఆపై ఏమీ తెలియనట్లు కిందకు వచ్చి తన కుమార్తె కనిపించడం లేదంటూ నాటకం ఆడింది. ఆదివారం సాయంత్రం ట్యాంక్లో తన్విక నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన రేఖ సోదరి శ్వేత, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది














