EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యువజన & క్రీడల శాఖ 99 రోజుల కార్యాచరణకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన

ఈతరం భారతం హైద్రాబాద్ మే 25 :

తెలంగాణ ప్రభుత్వం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా నిర్వహించిన 99 రోజుల కార్యాచరణలో యువజన & క్రీడల శాఖ చేపట్టిన “యువజన & క్రీడల వారోత్సవాలు” రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన పొందాయి.

మే 18 నుండి 23 వరకు నిర్వహించిన ఈ ఆరు రోజుల కార్యక్రమాలు యువతలో శారీరక దారుఢ్యం, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించడమే కాకుండా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేశాయి.

రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో యువజన సేవలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించగా యువజన సంఘాలు, క్రీడాకారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు సాధారణ ప్రజలు భారీగా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు.

మే 18

“ఫిట్ & యాక్టివ్ తెలంగాణ”తో ఉత్సాహభరిత ఆరంభం

వారోత్సవాల తొలి రోజు “ఫిట్ & యాక్టివ్ తెలంగాణ” పేరిట రాష్ట్రవ్యాప్తంగా మారథాన్‌లు, వాక్‌థాన్‌లు, యోగా, ధ్యానం, ఏరోబిక్స్, జుంబా కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.

హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో జరిగిన 5 కిలోమీటర్ల మారథాన్‌కు యువత పెద్ద సంఖ్యలో హాజరైంది. జిల్లా కేంద్రాల్లో మారథాన్‌లు, మండల కేంద్రాల్లో వెల్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించగా కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు స్వయంగా పాల్గొని యువతను ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

మే 19

కెరీర్ & నైపుణ్యాభివృద్ధి దినోత్సవం

యువతకు ఉపాధి దిశగా మార్గనిర్దేశం చేయాలనే లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి కోర్సులు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అవకాశాలు, స్కిల్ యూనివర్సిటీ ప్రోగ్రాములు, అగ్నివీర్ నియామకాలపై రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ప్రత్యేక వర్చువల్ సెషన్‌లు నిర్వహించారు.

విద్యార్థులు, యువత భారీగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి పాల్గొని “ఫిజికల్ లిటరసీ” ప్రాధాన్యంపై చేసిన సందేశం యువతలో చైతన్యాన్ని నింపింది.

మే 20

*యువజన నాయకత్వ సమ్మేళనం*లో యువత ఆలోచనలకు వేదిక

యువతలో నాయకత్వం, సృజనాత్మకత, సామాజిక అవగాహన పెంపొందించేందుకు “యూత్ లీడర్‌షిప్ సమ్మిట్” మరియు “యువజన పార్లమెంట్ సమావేశాలు” నిర్వహించారు.

విద్యాసంస్థలు, యువజన సంఘాల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమాల్లో యువత సామాజిక అంశాలపై చర్చలు జరిపింది.

సోషల్ మీడియా ప్రభావం, క్రీడల ద్వారా నైపుణ్యాల పెంపుదల, కుటుంబం – కెరీర్ సమతుల్యత, యువతకు అందుబాటులో ఉన్న క్రీడా అవకాశాలపై విద్యార్థులు, యువకులు చర్చాగోష్టులు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మే 21

“ప్లే & పార్టిసిపేట్ – స్పోర్ట్స్ డే”

రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్టేడియాలు, క్రీడా మైదానాల్లో క్రీడా మరియు వినోద కార్యక్రమాలు నిర్వహించి యువతలో సామూహిక భాగస్వామ్యాన్ని పెంపొందించారు.

జిల్లా యువజన మరియు క్రీడాధికారుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో యువత, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి స్వయంగా క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించడం విశేషంగా నిలిచింది.

మే 22

“సర్వ్ & సపోర్ట్”తో స్వచ్ఛ తెలంగాణకు యువత అంకితం

యువతలో సామాజిక బాధ్యత పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.

క్రీడా మైదానాలు, పార్కులు, చెరువులు, ఓపెన్ ప్రదేశాల్లో యువజన స్వచ్ఛంద సేవకులు, క్రీడాకారులు, ఎన్‌జీవోలు, ప్రజాప్రతినిధులు కలిసి శ్రమదానం చేశారు.

ఎల్.బి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

మే 23

“ఉద్యోగ సాధన”తో వేలాది యువతకు అవకాశాలు

వారోత్సవాల చివరి రోజు యువతకు ఉపాధి అవకాశాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు.

మే 1 నుండి 12 వరకు వివిధ జిల్లాల్లో నిర్వహించిన జాబ్ మేళాల్లో దాదాపు 40 వేల మంది యువకులు నమోదు చేసుకోగా, 22 వేల మందికి పైగా ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.

ఇందులో 11,200 మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ కాగా, దాదాపు 5,700 మందికి వివిధ సంస్థల నుండి నియామక పత్రాలు అందజేయడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అదేవిధంగా వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు.

రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైన నిర్వహణ

33 జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలు జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల సమన్వయం, యువజన సంఘాలు, క్రీడా సంఘాలు, విద్యార్థుల చురుకైన భాగస్వామ్యంతో విజయవంతమయ్యాయి.ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి అధికారులు, సిబ్బందిని అభినందించారు.

*యువతే తెలంగాణ భవిష్యత్తు* అనే నినాదానికి అర్థవంతమైన రూపం ఇచ్చిన ఈ వారోత్సవాలు యువ శక్తిని సమాజాభివృద్ధి దిశగా మళ్లించిన స్ఫూర్తిదాయక కార్యక్రమాలుగా నిలిచాయి.

Related News

Select the Topic
Scroll to Top