EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డీలిమిటేషన్ పై ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలు :ఏపీ, తెలంగాణలకే ఎక్కువ ప్రయోజనం!

ఈతరం భారతం న్యూఢిల్లీ జూన్ 12

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) పై ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది. ఓటింగ్ శాతాన్ని పెంచడం, పరిపాలనా సౌలభ్యం లక్ష్యంగా ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా స్థానాల సంఖ్యను 815గా అంచనా వేయగా, ఆర్థిక సలహా మండలి అంతకంటే అదనంగా మరో 9 స్థానాలను పెంచి 824 చేయాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్పులు..

ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు కీలక నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడేసి కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని రెండుగా విభజించాలని స్పష్టం చేసింది.అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ మార్పులు సూచించింది. రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది.

ఏపీ, తెలంగాణలకే ఎక్కువ ప్రయోజనం!

2024 ఎన్నికల గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో సగటున 18.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గత నాలుగు సార్వత్రిక ఎన్నికల (2009, 2014, 2019, 2024) సరళిని పరిశీలిస్తే, పెద్ద నియోజకవర్గాలతో పోలిస్తే చిన్న నియోజకవర్గాల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవుతున్నట్లు మండలి గుర్తించింది. మొత్తం 543 స్థానాల్లో 373 నియోజకవర్గాలను యథాతథంగా ఉంచి, మిగిలిన 170 స్థానాలను విభజించడం ద్వారా జాతీయ స్థాయిలో ఓటింగ్ శాతం 2.32% పెరుగుతుందని, తద్వారా 2.23 కోట్ల మంది అదనంగా ఓటు హక్కు వినియోగించుకుంటారని అంచనా వేసింది. ఈ విభజన వల్ల దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 6.55%, ఆంధ్రప్రదేశ్‌లో 3.52% మేర ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

హైదరాబాద్‌లో మారుతున్న భాషా సమీకరణాలు

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఓటర్ల వివరాలను కూడా నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇక్కడ ఉర్దూ మాట్లాడే వారి సంఖ్య 10.66 లక్షలుగా (మొత్తం ఓటర్లలో 64%) ఉందని వెల్లడించింది. అలాగే తెలుగు మాట్లాడేవారు 28%, హిందీ మాట్లాడేవారు 5.15% మంది ఉన్నట్లు పేర్కొంది. ఈ భాషా, జనాభా వైవిధ్యం ఆధారంగానే హైదరాబాద్‌ను మూడు నియోజకవర్గాలుగా విభజించాలని సిఫార్సు చేసింది. నియోజకవర్గాల పెంపునకు పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళల జనాభాతో పాటు భాషా సమీకరణాలను, గత ఎన్నికల పోలింగ్ శాతాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.

దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..?

మండలి సిఫార్సుల ప్రకారం దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో పెరగాల్సిన స్థానాల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతమున్న 80 స్థానాల నుంచి అత్యధికంగా 120 స్థానాలకు చేరనుంది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (48 నుంచి 72), పశ్చిమ బెంగాల్ (42 నుంచి 63), బీహార్ (40 నుంచి 60) ఉన్నాయి.దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు సీట్లు 39 నుంచి 59కి, కర్ణాటక 28 నుంచి 42కి పెరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతమున్న 25 స్థానాల నుంచి 38 స్థానాలకు, తెలంగాణ 17 స్థానాల నుంచి 26 స్థానాలకు పెరగాలని ఆర్థిక సలహా మండలి ప్రతిపాదించింది. అలాగే మధ్యప్రదేశ్ (44), గుజరాత్ (39), రాజస్థాన్ (38), ఒడిశా (32), కేరళ (30) స్థానాలకు పెరిగే అవకాశం ఉంది.

Related News

Select the Topic
Scroll to Top