EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైదరాబాద్‌లో భీకర వర్షం.. ఉరుములు, మెరుపులు.. సీఎం రేవంత్ విమానం బెంగళూరుకు మళ్లింపు

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 12

హైదరాబాద్‌లో ఒక్కసారిగా భీకర వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, భీకర గాలులతో కుండపోత వాన పడింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో నగరవాసులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఏర్పడింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తుండగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీఎం రేవంత్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.

రాత్రి 9.30 గంటలకు అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసింది. ఆకాశం దట్టంగా మబ్బులు కమ్ముకుని.. కుంభవృష్టి వాన పడింది. భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొన్ని నిమిషాల్లోనే భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ ఎత్తున ట్రాఫిక్‌ జామ్ అయింది.

వీకెండ్ కావడంతో.. అమీర్‌పేట్, మైత్రివనం, కూకట్‌పల్లి ప్రాంతాల్లో సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రైవేటు బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు.. ఆకస్మిక వర్షంతో చాలా మంది మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో.. మెట్రో స్టేషన్లలో భారీగా రద్దీ ఏర్పడింది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ చౌరస్తా, కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్, చింతల్, సుచిత్ర, కొంపల్లి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.

మరోవైపు.. నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇవాళ తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ప్రయాణిస్తున్న విమానం మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కానుండగా.. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో.. ఆ విమానం ల్యాండ్ అయ్యేందుకు ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి నిరాకరించింది. ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించకపోవడంతో.. చివరి నిమిషంలో సీఎం రేవంత్ రెడ్డి విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు.

Related News

Select the Topic
Scroll to Top