EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో అర్హులైన తెలంగాణ న్యాయవాదులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలి

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 15

హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన అర్హులైన న్యాయవాదులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సామాజిక న్యాయం ప్రతిబింబించేలా న్యాయవ్యవస్థలో మార్పులు రావాలని స్పష్టం చేస్తూ సోమవారం సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. సురేందర్ రెడ్డి అధ్యక్షతన హైకోర్టులో జరిగినఈ భేటీలో న్యాయమూర్తుల ఎంపికలో ప్రాంతీయ ప్రాతినిధ్యం ఆవశ్యకతపై సీనియర్ న్యాయవాదులు గళమెత్తారు. తెలంగాణలో అపారమైన ప్రతిభ, నిబద్ధత, సుదీర్ఘ అనుభవం కలిగిన న్యాయవాదులు ఎంతోమంది ఉన్నారని, హైకోర్టు బెంచ్‌కు వారిని ఎంపిక చేసే విషయంలో తగిన గుర్తింపు దక్కడం లేదని అసోసియేషన్ అభిప్రాయపడింది. న్యాయమూర్తుల ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే కాకుండా, ప్రజల భావోద్వేగాలు, ప్రాంతీయ వాస్తవాలు, అన్ని వర్గాలకు సమ ప్రాతినిధ్యం లభించేలా ఉండాలని నేతలు సూచించారు. న్యాయవ్యవస్థ అన్ని తరగతుల ఆకాంక్షలకు వేదికగా నిలవాలని తీర్మానంలో పేర్కొన్నారు.ఈ డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు అసోసియేషన్ కార్యచరణ ప్రకటించింది. భారత ప్రధాన న్యాయమూర్తి,సుప్రీంకోర్టు కొలీజియం సభ్యులు, కేంద్ర న్యాయశాఖ మంత్రి సహా రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రికి వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించింది. వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడా కోరనుంది. తెలంగాణ న్యాయవాదుల ఆత్మగౌరవాన్ని చాటేలా, నియామకాల్లో పారదర్శకతను కోరుతూ జూన్ 17న తెలంగాణ హైకోర్టు వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.

Related News

Select the Topic
Scroll to Top