ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 15
ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే వారి ‘మెదడు చోరీ అయినట్లు కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు.1980 లోనే సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందకముందే ఇందిరా గాంధీ సఫదర్జంగ్ రోడ్ నివాసంలో ఓటరుగా నమోదయ్యారని రికార్డులు ఉన్నాయని, కాంగ్రెస్ చరిత్రే ఓట్ల చోరీ, సీట్ల చోరీలతో కూడుకున్నదన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల్లో సర్దార్ పటేల్‌కు 28 ఓట్లు, నెహ్రూకు కేవలం 2 ఓట్లు వస్తే నెహ్రూను పీఎంను చేయడం ఓటు చోరీ కాదా అని ప్రశ్నించారు. 1975లో అలహాబాద్ హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని చోరీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది కాదా అని నిలదీశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ కు చెందినవారికి రిటైర్మెంట్ తర్వాత పద్మ అవార్డులు, రాజ్యసభ సీట్లు ఇచ్చి రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను దెబ్బతీసిందని ఆరోపించారు.
బోగస్ ఓట్లతో గెలిచే అలవాటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల తమ దొంగ ఓట్లు ఎగిరిపోతాయనే భయంతో ఏడుస్తున్నాయన్నారు. ఎస్ఐఆర్ వల్లే బెంగాల్లో బీజేపీ గెలిచిందని మేధావులమని చెప్పుకునే కొందరు కాంగ్రెస్ నేతలు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. అదే ఎస్ఐఆర్ జరిగిన కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలిచినప్పుడు ఎస్ఐఆర్ గుర్తుకురాలేదా అని నిలదీశారు. దేశ సరిహద్దులైన బిహార్, పశ్చిమ బెంగాల్‌తో పాటు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీ అక్రమ చొరబాటుదారులు స్థానికంగా రాజకీయ పార్టీల మద్దతుతో దొంగ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు సంపాదించి ఓటర్లుగా నమోదవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీలో ఒక్కో ఇంట్లో 200 దొంగ ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
హైదరాబాద్‌లో దాదాపు 5 వేల నుండి 10 వేల మంది పాకిస్తానీయులు చట్టవిరుద్ధంగా ఓవర్ స్టేయింగ్ చేస్తున్నారని, వారికి ఓటు హక్కు కల్పించాలా అని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలను ప్రశ్నిస్తూ నిలదీశారు. భారత రాజ్యాంగం ప్రకారం కేవలం భారత పౌరుడికి మాత్రమే ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. దొంగ ఓట్లను ఏరివేయడమే ఎస్ఐఆర్ లక్ష్యమని, అర్హులైన ఏ ఒక్క పౌరుడి ఓటూ పోదని హామీ ఇచ్చారు. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు రాజకీయ స్వార్థంతో బురదజల్లుతున్నాయని మండిపడ్డారు. ఎస్ఐఆర్ అనేది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం నిర్వహించే నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు.
దేశంలో ఇప్పటివరకు 12 సార్లు ఈ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని గుర్తుచేశారు. కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, చిరునామాలు మారిన వారి వివరాల సవరణ కోసమే ఎస్ఐఆర్ నిర్వహిస్తారన్నారు. 1951 నుండి 2002 వరకు కాంగ్రెస్ హయాంలోనే అనేకసార్లు ఎస్ఐఆర్ జరిగితే అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నాడు తాము ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించామని, కానీ నేడు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే స్వరంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ కుట్రపూరిత ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.















