ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 15:
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మద్దతు ధర , ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం నుంచి సరైన స్పందన లభించడం లేదని, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం కేవలం మద్దతు ధరను ప్రకటించి, ఆ తర్వాత కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకుంటోందని మంత్రి ధ్వజమెత్తారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకే రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, అలా నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నా కూడా ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. మద్దతు ధర ప్రకటించిన అన్ని రకాల ధాన్యాలనూ సేకరించాల్సిన ప్రాథమిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం చేతులెత్తేసినా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడలేదని తుమ్మల గుర్తుచేశారు. ఇప్పటికే 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నతో పాటు, 2 లక్షల మెట్రిక్ టన్నుల జొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కొనుగోలు చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఈ ధాన్యం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా సేకరించి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.















