ఈతరం భారతం చిలకలూరి పేట, జూన్ 20:
అన్నదాత సుఖీభవ కార్యక్రమం సందర్భంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న రైతు గుడిపల్లి నాగభూషణంకు చెందిన పొలాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతు నాగభూషణం తాను చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని నాగభూషణం తెలిపారు. ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు భూసారం, దిగుబడులు పెరిగి వ్యవసాయం లాభాదయకంగా మారిందని సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నామని… రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తనకు కలిగిన లబ్ధిని, ప్రయోజనాలను నాగభూషణం ముఖ్యమంత్రికి వివరించారు. నాగభూషణం లాంటి రైతులే ప్రకృతి వ్యవసాయానికి ఆదర్శంగా నిలుస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇదే సమయంలో నాగభూషణానికి చెందిన గానుగను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి తదితర నూనెగింజలను సహజ పద్ధతిలో గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నట్టు నాగభూషణం వివరించారు. గానుగ ఏర్పాటు అదనపు ఆదాయ వనరుగా మారిందని, ఇటువంటి సంప్రదాయ ఆధారిత పరిశ్రమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. తాము ఉత్పత్తి చేస్తున్న కోల్డ్ప్రెస్డ్ వేరుశెనగ నూనెను అనేక మందికి సరఫరా చేస్తున్నామని, మీరు కూడా వినియోగించాలని ముఖ్యమంత్రిని నాగభూషణం కోరారు. ఇంట్లో ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే తన సతీమణి భువనేశ్వరిని అడగాలంటూ అక్కడి నుంచే ఆమెకు ఫోన్ చేసి మాట్లాడి ఒక లీటరు వేరుశనగ నూనెను సీఎం చంద్రబాబు కొనుగోలు చేశారు.
వివిధ రకాల పంటల సాగుతో మెరుగవుతున్న జీవ వైవిధ్యం
అనంతరం ముఖ్యమంత్రి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. జీవామృతం, ఘన జీవామృతం, వేపాస్త్రం వంటి సహజ వ్యవసాయ ఉత్పాదనలను స్థానికంగా లభించే వనరులతో తయారు చేసి రైతులకు అందజేస్తున్న విధానాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులకు శిక్షణ, ప్రదర్శనలు, సాంకేతిక సహాయాన్ని కూడా ఈ కేంద్రం అందిస్తోందని నాగభూషణం చెప్పారు. ఆ తర్వాత బొప్పాయి తోటను పరిశీలించి..రైతు అందించిన బొప్పాయి పండును సీఎం తిన్నారు. బొప్పాయితో పాటు ఇతర పంటలను సాగుతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగుపడుతోందని రైతు వివరించారు. చీడపీడల నివారణకు కూడా ఇది దోహదపడుతోందని నాగభూషణం సీఎం చంద్రబాబుకు వివరించారు.















