ఈ తరం భారతం హైదరాబాద్, జూన్ 27:
విశ్వబ్రాహ్మణుల కులాన్ని మాయం చేసే కుట్రలో భాగంగానే పాలకులు కులగణనలో అయిదు వృత్తులను వేర్వేరు కులాలుగా నమోదుచేశారని ఆ సామాజిక వర్గం ప్రముఖులు, మేధావులు ఆరోపించారు. సృష్టి ఆరంభం నుంచీ మానవాళికి దిక్సూచిగా ఉన్న విశ్వకర్మల లెక్కలు తేలితే… ఎక్కడ రాజ్యాధికారంలో వాటాలు ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతోనే అగ్రకులాలు, పాలకులు కలిసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజించు-పాలించు అనే సూత్రాన్ని అమలుచేస్తూ… ఏకంగా విశ్వబ్రాహ్మణ కులాన్ని విడగొట్టి విచ్చిన్నం చేయడానికి ఉద్దేశపూర్వకంగానే అయిదు వృత్తులను అయిదు కులాలుగా కులగణనలో చూపించే యత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం తొలి శాసనసభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీసిరికొండమధుసూదనాచారి, బిసి కుల సంఘాల జేఏసీ చెర్మెన్ కుందారంగణేశ్‌చారి,మెట్రో ఈవినింగ్స్ పత్రిక చీఫ్ ఎడిటర్ దేవరకొండ కాళిదాస్, విశ్వకర్మ ఫౌండేషన్ అధ్యక్షుడు అడ్లూరి రవీంద్రాచారి, పెద్దలు దాసోజు గోవర్ధన్ చారి, మదన్‌మోదన్, బొడ్డుపల్లి సుందర్, యాదగిరి, తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ మేరకు పలు తీర్మానాలపై చర్చ జరిగింది.ఈ సందర్బంగా బిసి కుల సంఘాల జేఏసీ చెర్మెన్ కుందారం గణేశ్‌చారి మాట్లాడుతూ కుట్రపూరితంగానే అయిదు వృత్తుల వారిని వేర్వేరు కులాలుగా గుర్తించి, విశ్వబ్రాహ్మణ కులాన్ని బలహీనపర్చారని పేర్కొన్నారు. విశ్వకర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అడ్లూరి రవీంద్రాచారి ముగింపు ఉపన్యాసం చేస్తూ, అన్ని జిల్లాల విశ్వకర్మ ప్రముఖులతో జులై 7న మరో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ… అధికారం, సంపద అంతా కూడా అగ్రకులాల ఆధీనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలలో విశ్వకర్మల జనాభా అసలు లెక్కలు తేలితే… రాజ్యాధికారంలో వాటా అడుగుతారన్న భయంతోనే… అయిదు వృత్తులు చేస్తున్న విశ్వబ్రాహ్మణులను అయిదు వేర్వేరు కులాలుగా గణిస్తున్నారని తెలిపారు. నేడు ఎన్నికల ముఖచిత్రం చూస్తే… కేవలం 2-3 శాతం ఓట్ల తేడాలో ప్రభుత్వాలు తారుమారు అవుతున్నాయని చెప్పారు. అందుకే తెలంగాణలో 4-5 శాతం జనాభా ఉన్న విశ్వబ్రాహ్మణులను విభజిస్తున్నారని విమర్శించారు. కాబట్టి… విశ్వకర్మీయులే తమ కులగణనకు సర్వే నిర్వహించాలని ఆయన సూచించారు.















