ఈతరం భారతం న్యూఢిల్లీ జులై 14
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై విచారణ జరిపి..కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నిధుల దుర్వినియోగంపై న్యాయస్థానం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపి, రామాలయ నిర్వహణను చూసుకునే ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’కు కూడా తమ సమాధానాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నిధుల దుర్వినియోగంపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించిన ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ సిట్ బృందంలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారనే వివరాలను కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (జూలై 20, 2026) వాయిదా వేసింది.















