ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 8
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వైఖరిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నిర్ణయాలను ఆమె నిర్మోహమాటంగా అంగీకరించారని, కానీ ఇప్పటి కాంగ్రెస్ నాయకత్వం మాత్రం తమ సొంత తప్పులను, లోపాలను అసలు గుర్తించడమే లేదని ఎద్దేవా చేశారు. శనివారం ‘ఎక్స్’ (X) వేదికగా 1975 ఎమర్జెన్సీ, ప్రతిపక్ష నేతల అరెస్టులను సమర్థిస్తూ ఇందిరా గాంధీ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియోను ఆయన షేర్ చేశారు.ఇందిరా గాంధీ తీసుకున్న విధానాలు, చర్యలతో తాము ఏకీభవించకపోయినప్పటికీ, ఆ నిర్ణయాలను అంగీకరించే విషయంలో ఆమె ఎంతో స్పష్టంగా ఉండేవారని రిజిజు పేర్కొన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను తెలుసుకోకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు. సదరు వీడియోలో ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి యత్నించడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఇందిరా గాంధీ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు మరియు నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో కిరణ్ రిజిజు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.















