ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 8
భద్రత నుండి ప్రాతినిధ్యం వరకు మహిళలకు బీజేపీ ద్రోహం చేస్తూనే ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. బీజేపీ మహిళా వ్యతిరేక వైఖరి యావత్ దేశానికి తెలుసని, దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ ఎన్నడూ ఒక మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమించలేదని దుయ్యబట్టారు.కానీ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిని, మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిని ఇచ్చిందని అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్ష పదవితో సహా పార్టీలోని అత్యున్నత నాయకత్వ పదవులను మహిళలకు అప్పగించిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు చేసిన మంత్రి.. దేశవ్యాప్తంగా, పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని అయినప్పటికీ చర్యలు తీసుకోకపోగా వారిని రక్షిస్తూ వస్తోందని ఆరోపించారు.
డీలిమిటేషన్ సాకు వెనుక దాక్కోవడం మానుకోవాలి:
మహిళల పురోగతికి, సాధికారతకు వ్యతిరేకంగా ఉండే పార్టీ ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన సాకుతో మహిళా రిజర్వేషన్ చట్టం అమలును ఆలస్యం చేస్తోందని దుయ్యబట్టారు. ఇకనైనా బీజేపీ నియోజకవర్గాల పునర్విభజన సాకు వెనుక దాక్కోవడం మానుకుని డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ చట్టం అమలు నుండి వేరు చేయాలన్నారు. ఎటువంటి సాకులు, షరతులు లేకుండా మహిళలకు వారి న్యాయమైన ప్రాతినిధ్యాన్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.















