ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 8
సాంకేతిక పురోగతి కారణంగా ప్రపంచ శక్తి సమీకరణాలు వేగంగా మారుతున్నాయని వికసిత్ భారత్ సాధనకు ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక రంగాలు స్వయంసమృద్ధి సాధించడం అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.
శనివారం జరిగిన ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్ సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాని మోడీ పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశ యువతకు కీలక సూచనలు చేశారు. పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు వాటిని చూసి భయపడకుండా వాటికి పరిష్కారాలు కనుగొనే ధైర్యాన్ని ప్రదర్శించాలని విద్యార్థులకు మోడీ పిలుపునిచ్చారు. అందుకే, ప్రశ్నించడం కాదు.. సమస్యకు పరిష్కారం కనుగొనడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ దేశ యువతరం శక్తి సామర్థ్యాలపై తమకు ఎంతో విశ్వాసం ఉందని అన్నారు.
దేశ అవసరాలు తీర్చేలా నిర్ణయాలు:
రాబోయే 30-35 ఏళ్లలో మీరు ఏం చేస్తున్నారన్నదే వికసిత్ భారత్‌ను నిర్ణయిస్తుందని మోడీ చెప్పారు. అందువల్ల మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే.. ఈ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనేది ఆలోచించాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచం, సాంకేతికత, పరిశ్రమలు ఎలా మారతాయో ఊహించడం చాలా కష్టం అని అయితే ఈ మార్పుల మధ్య నిరంతరం నేర్చుకునే వారే విజయం సాధిస్తారని అన్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో యువత కూడా భాగస్వామి కావాలని, యువత తీసుకునే ప్రతి నిర్ణయం దేశ ప్రయాణాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. అందువల్ల మీరు చేసే ప్రతి పని దేశ అవసరాలను తీర్చేలా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. సెమీకండక్టర్లు, డ్రోన్ల రంగంలో లభిస్తున్న అవకాశాలను ప్రధాని గుర్తుచేశారు. చిప్స్ నుంచి షిప్స్ వరకు ప్రతీదీ భారత్‌లోనే తయారవుతుందని, వ్యవసాయం, వైద్యం, రక్షణ రంగాల్లో యువత డ్రోన్ సాంకేతికతతో కొత్త ఆవిష్కరణలు చేస్తోందని తెలిపారు.
పరిశోధనలకు ప్రోత్సాహం:
రీసెర్చ్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భగా ప్రధాని వివరించారు. ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్ (PMRF) ద్వారా ప్రతిభావంతులకు అవకాశాలు కల్పిస్తున్నామని నూతన ఆలోచనలను ప్రోత్సహించడానికి ‘రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్’తో పాటు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరిశోధన రంగం కోసం రూ. 1 లక్ష కోట్ల నిధుల కేటాయించినట్టు తెలిపారు. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ద్వారా అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్స్ చిన్న పట్టణాల్లోని విద్యార్థులకు కూడా ఉచితంగా లభించే వెసులుబాటు కల్పించామన్నారు.















