EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఝార్ఖండ్ పరీక్షల్లో అవకతవకలపై 16 రోజులుగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు

ఈతరం భారతం న్యూఢిల్లీ 9

ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో (JPSC, JSSC) అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ యువత చేపట్టిన ఆందోళనలు 16వ రోజుకు చేరాయి. ఆరుగురు విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండటంతో రాష్ట్రంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదివారం స్పందించారు. ఝార్ఖండ్ ఆదివాసీ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కీలక హామీ ఇచ్చారు. విద్యార్థుల సమస్య తన సమస్యేనని, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమస్యల్ని లాఠీలు, బుల్లెట్లతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హేమంత్ సోరెన్ అన్నారు. విద్యార్థుల ఆందోళనల్ని రాజకీయ కోణంలో చూడొద్దని, రాజకీయ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టించొద్దని రాజకీయ పార్టీల్ని సీఎం హెచ్చరించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు కొన్ని స్వార్థ ప్రయోజన శక్తులు ప్రయత్నిస్తున్నాయని హేమంత్ సోరెన్ ఆరోపించారు. ప్రభుత్వం బలపడటాన్ని జీర్ణించుకోలేని కొందరు అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘లాఠీ- తుపాకులు కాదు. చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం’ అని ఆయన పేర్కొన్నారు. ఆయుధాలనేవి దేశ సరిహద్దుల్లోని శత్రువుల కోసం ఉపయోగించాల్సినవని, మన దేశంలో మన ప్రజలపై బలప్రయోగం చేయడం ద్వారా సమస్యలు ఎన్నటికీ పరిష్కారం కావని అన్నారు.

ప్రభుత్వ నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని సోరెన్ తెలిపారు. విద్యార్థులు తమ హక్కుల కోసమే ఆందోళన చేస్తున్నారని, వారికి కచ్చితంగా న్యాయం అందేలా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ‘యువత తమ ఆందోళనలకు రాజకీయ అండదండలు కోరాల్సిన అవసరం లేదు. న్యాయం పొందడం వారి హక్కు. రాజకీయ పార్టీలు నిజాన్ని, అబద్ధాల్ని కలిపి యువతను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అందుకే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని సీఎం హేమంత్ సోరెన్ సూచించారు.

జేపీఎస్‌సీ, జేఎస్ఎస్‌సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు చేపట్టిన నిరసనలు ఆదివారంతో 16 వ రోజుకు చేరాయి. విద్యార్థులు రాత్రింబవళ్లు ఆందోళనలు, నిరవధిక ధర్నా కొనసాగిస్తున్నారు. ఆరుగురు విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. జులై 5న JPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. నియామక ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు లేదా రిటైర్డ్ హైకోర్ట్ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయించి స్వతంత్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. JPSC పరీక్షను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జేపీఎస్‍‌సీ, జేఎస్ఎస్‌సీ వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని విద్యార్థులు కోరుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top