EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా మెఫెడ్రోన్‌ డ్రగ్‌ స్వాధీనం

ఈతరం భారతం యాదాద్రి భువనగిరి ఆగస్ట్ 9

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా మెఫెడ్రోన్‌ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ యాదాద్రి-భువనగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 27 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.54 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.బీబీనగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ యాదాద్రి-భువనగిరి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 27 కిలోల మెఫెడ్రోన్‌ను పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.54 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు వెల్లడించారు.

యాదాద్రి భువనగిరి ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌ ఆదేశాల మేరకు డ్రగ్స్‌ అక్రమ తయారీ, రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం అందడంతో ఆగస్టు 8న కొండమడుగు గ్రామ శివారులో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా MH-49-CW-1313 నంబరు గల ఫార్చ్యూనర్‌ కారును ఆపి తనిఖీ చేయగా 27 కిలోల మెఫెడ్రోన్‌తోపాటు సుమారు 40 కిలోల అసిటోన్‌ లభించింది.

పోలీసుల విచారణలో కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్స్‌లో ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు మెఫెడ్రోన్‌ను అక్రమంగా తయారు చేసినట్లు వెల్లడైంది. అనంతరం దాన్ని కొండమడుగు నుంచి నాగ్‌పూర్‌కు తరలించి అక్కడ పంపిణీ చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల సమాచారంతో పోలీసులు వేటుకూరి ల్యాబ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. డ్రగ్‌ తయారీలో ఉపయోగించిన రియాక్టర్‌, సెంట్రిఫ్యూజ్‌ తదితర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత ల్యాబ్‌ను సీజ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

నలుగురి అరెస్టు

అరెస్టయిన వారిలో మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన చేతన్‌ మధుకర్‌ మెష్రామ్‌ (49), అసోంలోని మారిగావ్‌కు చెందిన ముజామల్‌ హక్‌ (25), నాగ్‌పూర్‌కు చెందిన ఆకాశ్‌ అశోక్‌ గవాండే (31), హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన ఉపద్రష్ట రమణమూర్తి (65) ఉన్నారు.చేతన్‌ డ్రగ్‌ తయారీకి ఆర్గనైజర్‌గా, ఆర్థిక సహకారం అందించిన వ్యక్తిగా.. ముజామల్‌ హక్‌ తయారీ ప్రక్రియలో సహకరించిన వ్యక్తిగా.. ఆకాశ్‌ గవాండే అక్రమ రవాణాలో సహకరించిన వ్యక్తిగా.. రమణమూర్తి వేటుకూరి ల్యాబ్స్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.

మరో నలుగురి కోసం గాలింపు

ఈ కేసులో ఎం.డి. అయూబ్‌ అలీ (అసోం), చందా ప్రదీప్‌ ఠాకూర్‌ (నాగ్‌పూర్‌), గోపాల్‌ సిర్పట్‌ పటేలియా (నాగ్‌పూర్‌), యేటుకూరి రామరాజు (పీర్జాదిగూడ, మేడిపల్లి) పరారీలో ఉన్నారు. వీరిలో అయూబ్‌ అలీ ల్యాబ్‌ ఏర్పాటు, ముడి పదార్థాల సమీకరణ, కెమిస్ట్‌ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించినట్లు.. ప్రదీప్‌ ఠాకూర్‌, గోపాల్‌ పటేలియా డ్రగ్‌ పెడ్లర్లుగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. యేటుకూరి రామరాజు ల్యాబ్‌ యజమానిగా ఉన్నట్లు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో 27 కిలోల మెఫెడ్రోన్‌, 40 కిలోల అసిటోన్‌ లిక్విడ్‌, ఆరు సెల్‌ఫోన్లు, ఫార్చ్యూనర్‌ కారు, డ్రగ్‌ తయారీకి ఉపయోగించిన రియాక్టర్‌, సెంట్రిఫ్యూజ్‌, ఇతర పరికరాలు ఉన్నాయి.ఎన్‌డీపీఎస్‌ చట్ట నిబంధనలకు అనుగుణంగా, పంచుల సమక్షంలో చట్టపరమైన ప్రక్రియను పాటిస్తూ ఆపరేషన్‌ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Related News

Select the Topic
Scroll to Top