EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దేశంలోనే తొలి మహిళా ‘టాప్ గన్‌’గా భావనా కాంత్

ఈతరం భారతం న్యూఢిల్లీ ఆగస్ట్ 9

భారత వాయుసేన స్క్వాడ్రన్‌ లీడర్‌ భావనా కాంత్‌ మరో అరుదైన ఘనతను సాధించారు. కఠినమైన సైనిక శిక్షణ, నిరంతర సవాళ్ల మధ్య ఆమె ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రతిష్ఠాత్మకమైన ‘ఫైటర్ కంబాట్ లీడర్’ (FCL) కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో దేశంలోనే తొలి మహిళా ‘టాప్ గన్‌’గా నిలిచారు. దీంతో భావనా కాంత్‌ స్వస్థలమైన బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతం మురిసిపోతోంది.

భావనా కాంత్ స్వస్థలం దర్భంగా జిల్లా ఘన్‌శ్యామ్‌పుర్ బ్లాక్‌లోని బౌర్ గ్రామం. ఆమె తండ్రి తేజ్ నారాయణ్ కాంత్. ఆయన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌‌గా పనిచేశారు. బౌర్ గ్రామంలోనే భావనా కాంత్ ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. బెగుసరాయ్‌లో 12వ తరగతి వరకు చదివారు. పాఠశాల విద్య పూర్తైన కోచింగ్ కోసం కోట (రాజస్థాన్)కు వెళ్లారు. అనంతరం బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తల్లిదండ్రుల స్ఫూర్తి, ఆమె అచంచలమైన అంకితభావం, కఠోర శ్రమతో భావన భారత వాయుసేనకు ఎంపికయ్యారు.

భారత ప్రభుత్వం 2015లో మొదటిసారిగా మహిళలకు ఫైటర్ (పోరాట విమాన) విభాగంలో అవకాశాలు కల్పించింది. 2016లో కేంద్ర ప్రభుత్వం మహిళలకు ఫైటర్‌ స్ట్రీమ్‌ను ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పుడు అవనీ చతుర్వేది, మోహనా సింగ్‌లతో కలిసి ఎంపికైన భారత తొలి మహిళా ఫైటర్‌ పైలట్ల త్రయంలో భావనా కాంత్ ఒకరు. భావన ‘ఫ్లయింగ్ ఆఫీసర్’ గా భారత వాయుసేనలో చేరారు. 2018 మార్చిలో ఆమె మిగ్-21 బైసన్ ఫైటర్ జెట్‌లో తన మొదటి విజయవంతమైన సోలో విమానయానాన్ని (ఒంటరిగా విమానం నడపడం) పూర్తి చేశారు.

2019 మేలో మిగ్-21 బైసన్‌పై ‘డే ఆపరేషన్ కోర్సు’ను భావనా కాంత్ పూర్తి చేశారు. 2020 మార్చి నాటికి పగటిపూట కంబాట్‌ మిషన్లను నిర్వహించడానికి అర్హత సాధించారు. మిగ్-21 బైసన్ మాత్రమే కాకుండా వైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక ఫైటర్ విమానమైన ‘సుఖోయ్-30 MKI’ (Su-30 MKI)ని కూడా విజయవంతంగా నడిపారు భావనా కాంత్. 2020లో భారత ప్రభుత్వం నుంచి ‘నారీ శక్తి పురస్కార్‌’ అందుకున్నారు. 2021 రిపబ్లిక్ డే పరేడ్‌లో ఐఏఎఫ్‌ శకట ప్రదర్శనలో పాల్గొన్న తొలి మహిళా ఫైటర్‌ పైలట్‌గా ఘనత సాధించారు. తాజాగా ‘ఫైటర్ కాంబాట్ లీడర్’  కోర్సును పూర్తి చేసిన దేశ తొలి మహిళా ఫైటర్ పైలట్‌గా నిలిచారు

Related News

Select the Topic
Scroll to Top