ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 28 శుక్రవారం
తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మీర్‌ఖాన్‌పేట-ముచ్చర్ల గ్రామాల మధ్యలో దాదాపు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణమవుతోంది. దీంతో ఆ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫ్యూచర్‌సిటీలో భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వం కేటాయించిన లే-అవుట్లు, స్థలాలకు గిరాకీ పెరుగుతోంది. ఫ్యూచర్ సిటీకి భూములిచ్చిన 6 వేల మంది రైతులకు ప్రభుత్వం అభివృద్ధి చేసిన లేఅవుట్లను కేటాయించింది. నిర్వాసితులకు ఎకరాకు రూ.8 లక్షల పరిహారంతో పాటు 121 చదరపు గజాల ఓపెన్ ప్లాట్లు ఇచ్చింది.మీర్‌ఖాన్‌పేట్, పంజాగూడ, కుర్మిద్ద, తాటిపర్తి, మేడిపల్లి, నానక్‌నగర్, ముచ్చర్ల గ్రామాల్లో నివసిస్తున్న రైతుల నుంచి భారత్ ఫ్యూచర్‌సిటీ కోసం ప్రభుత్వం రెండు దశల్లో భూములను తీసుకుంది. ఆయా గ్రామాల ప్రజలకు పంజాగూడ రెవెన్యూ పరిధిలో లేఅవుట్లు డెవలప్ చేసింది. దాదాపు 6 వేల మంది రైతులకు ఓపెన్ ప్లాట్లు కేటాయించింది. రైతుల పిల్లలు చదువుకునేందుకు వీలుగా యంగ్ ఇండియా సమీకృత గురుకుల స్కూల్ సైతం ప్రభుత్వం నిర్మిస్తోంది. అయితే అక్కడి లే-అవుట్‌లో ఇళ్లు కట్టుకునేందుకు కొందరు సుముఖంగా లేరు. ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం, ప్లాట్ అమ్మితే వచ్చే డబ్బుతో హైదరాబాద్ దగ్గర్లో భూములు కొనాలని నిర్ణయించారు. ఒకరిద్దరు రైతులు ఏడాది క్రితం విక్రయించగా.. 121 చదరపు గజాల ప్లాటు రూ.5 లక్షలకు అమ్ముడయ్యింది.
తాజాగా రియల్ ఎస్టేట్ పుంజుకుంది. ఫ్యూచర్‌సిటీ కార్యాలయం రెండు నెలల క్రితం ప్రారంభమవగానే.. ప్లాట్ల ధరలు అమాంతం పెరిగాయి. ఫ్యూచర్‌సిటీ పరిసర ప్రాంతాల్లో నిన్న మెున్నటి వరకు చదరపు గజం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ ధర పలకగా.. నిర్వాసితులకు ఇచ్చిన ప్లాట్ల ధర అనూహ్యంగా పెరిగింది. రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఒక్కో ప్లాటు అమ్ముడవుతోంది. అంటే దాదాపు 10 వేల నుంచి రూ.23 వేల వరకు గజం పలుకుతోంది. జులైలో ఒక రైతు తన ప్లాటును రూ.28 లక్షలకు విక్రయించారు. ఆ ప్లాట్లను కొంటే భవిష్యత్తులో మౌలిక సదుపాయాలు వేగంగా సమకూరుతాయన్న అంచనాతో కొందరు వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూములు కొనే ఆర్థిక స్థోమత లేని వారు భవిష్యత్ పెట్టుబడిగా ఫ్యూచర్ సిటీలో స్థలాలు కొనేందుకు రెడీ అవుతున్నారు.















