ఈతరం భారతం జగిత్యాల ఆగస్టు 28 శుక్రవారం:
ఇప్పటివరకు నన్ను కన్నయ్య, చిన్ను, బంగారం అంటూ ముద్దుగా పిలిచారు.. ఇకపై నాకంటూ ఓ స్టైలిష్ పేరు కావాలి. అది కూడా ఔట్‌డేటెడ్ పేరు కాకూడదు..గూగుల్‌లో సెర్చ్ చేసినా దొరకనంత యూనిక్‌గా ఉండాలి.. మీ మైండ్‌లో అలాంటి పేరు ఉంటే నామకరణం రోజున వచ్చి నా చెవిలో చెప్పేయండి.. మీ పేరు నాకు నచ్చితే మా నాన్నతో మీ వార్తలకు స్పెషల్ కవరేజ్ ఇప్పిస్తా… అంటూ ఓ చిన్నారి తరఫున ముద్రించిన వెరైటీ నామకరణ ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో దిశ పత్రిక రిపోర్టర్‌గా పనిచేస్తున్న మద్దెల గోవర్ధన్-దివ్య దంపతుల కుమారుడి నామకరణ మహోత్సవం సందర్భంగా ఈ క్రియేటివ్ ఇన్విటేషన్ కార్డును రూపొందించారు.
సాధారణంగా నామకరణానికి విచ్చేసి చిన్నారిని ఆశీర్వదించండి అంటూ ఉండే ఆహ్వాన పత్రికలకు భిన్నంగా.. చిన్నారే స్వయంగా ఆహ్వానిస్తున్నట్టుగా కార్డును డిజైన్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. నాకు పెట్టబోయే పేరు ట్రెండీగా ఉండాలి.. స్టైలిష్‌గా ఉండాలి.. ఎక్కడ చూసినా కనిపించే రొటీన్ పేరు కాకూడదు.. గూగుల్‌లో కూడా దొరకకూడదు అంటూ చిన్నారి చెబుతున్నట్టుగా కార్డులో పేర్కొన్న మాటలు బంధువులు, స్నేహితులను తెగ ఆకట్టుకుంటున్నాయి. సాధారణ ఆహ్వాన పత్రికను కాస్త క్రియేటివిటీతో మార్చడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బుడ్డోడి కి మంచి పేరు పెట్టి ఫ్రీ కవరేజ్ పొందండి అంటూ బంధువులు, స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఇన్విటేషన్ కార్డు చక్కర్లు కొడుతుంది.















