EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ప్రజల వాడుక భాషలోనే రచనలు ఉండాలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి

ఈతరం భారతం మేడ్చల్ (కాప్రా) సెప్టెంబర్ 8:

_____________________________________

ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా, ప్రజల వాడుక భాషలోనే రచనలు సాగాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం కాప్రా ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన ‘తెలుగునాడు’ మాసపత్రిక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభకు ‘తెలుగునాడు’ మాసపత్రిక ఎడిటర్ గుమ్మడి హరిప్రసాద్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషలో ఎంతోమంది కవులు, రచయితలు విలువైన రచనలు చేస్తున్నారని, వారి రచనలు అభ్యుదయంతో పాటు సమాజాన్ని ప్రగతి వైపు నడిపించే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలుగు భాషలో దాగి ఉన్న గొప్పతనం, వైభవం, ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి భాష పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ పద్యకవి డాక్టర్ రాధశ్రీ మాట్లాడుతూ పద్యాల ద్వారా ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపించవచ్చన్నారు. వేమన కాలం నుంచి నేటి వరకు పద్యం ప్రజలను చైతన్యపరిచే సాధనంగా కొనసాగుతోందని తెలిపారు.

స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ గిడుగు రామమూర్తి పంతులు వ్యవహారిక భాష కోసం చేసిన కృషిని వివరించారు. కాళోజి నారాయణరావు తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించడంతో పాటు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించారని పేర్కొన్నారు.

సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్ మాట్లాడుతూ నేటి సమాజంలో అనేక ఉద్యమాలకు గీతాలు ఊపిరి పోశాయని అన్నారు. పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు అనేక ఉద్యమాలు విజయవంతమైన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సమాజాన్ని ప్రభావితం చేయడంలో గీత రచనలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.

కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వడ్లోజు జ్యోతిర్మయాచారి మాట్లాడుతూ ప్రస్తుత జర్నలిజం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సవాళ్లను వివరించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల బాధ్యత కీలకమన్నారు.

ఈకార్యక్రమంలో ‘తెలుగునాడు’ ఎగ్జిక్యూటివ్ బంగారు బి.వి. ఆచార్యులు, ‘కుసుమ జయభేరి’ సంపాదకులు రాధా కుసుమ, ‘ధరణి’ పత్రిక సంపాదకులు జి. రోజారాణి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top