ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 9 బుధవారం:
_________________________________________
తెలంగాణలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని మరియు నాచురోపతి వంటి ఆయుష్ కోర్సులు అభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. హౌస్ సర్జన్లు అలాగే పీజీ విద్యార్థుల నెలవారీ స్టైఫండ్‌ను అల్లోపతి వైద్య విద్యార్థులతో సమాన స్థాయికి సవరిస్తూ బుధవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని వందలాది మంది వైద్య విద్యార్థులకు గణనీయమైన ఆర్థిక భరోసా లభించనుంది.తాజా పెంపుతో హౌస్ సర్జన్ల నెలవారీ స్టైఫండ్ గతంలో ఉన్న రూ. 13,754 నుంచి ఏకంగా రూ. 29,792కు పెరిగింది. అలాగే పీజీ వైద్య విద్యార్థుల స్టైఫండ్ రూ. 34,385 నుంచి రూ. 74,482కు పెరిగింది. దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ ప్రధాన డిమాండ్‌ను నెరవేర్చినందుకు ఆయుష్ విద్యార్థులు మరియు వైద్యులు సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.గత పదేళ్ల కాలంలో గత పాలకులు తమ స్టైఫండ్‌లను ఒక్కసారి కూడా పట్టించుకోలేదని, దీనివల్ల తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడ్డామని విద్యార్థులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. తమ సమస్యను సానుకూలంగా అర్థం చేసుకుని, అల్లోపతి విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ అందజేసేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఆరోగ్య మంత్రికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.















