ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయం 09.09.2026
__________________________________________________________
పోలీస్ శాఖకు చెందిన వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండీషన్లో ఉంచుతూ, వాటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ వాహనాల డ్రైవర్లను ఆదేశించారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో వివిధ పోలీస్ స్టేషన్లు, పోలీస్ అధికారుల వినియోగంలోని వాహనాలను ఎస్పీ స్వయంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ప్రతి వాహనం కండీషన్, పనితీరు, నిర్వహణ తీరును పరిశీలించిన ఎస్పీ.. డ్రైవర్లతో మాట్లాడి విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డ్రైవర్ తన వాహనం పనితీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వాహనాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు.
పోలీస్ డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో విధులు నిర్వహించే సమయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రజలకు వేగంగా అందుబాటులో ఉండటంలో పోలీసు వాహనాల డ్రైవర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇ.శ్రీనివాస్, ఆర్ఐ ఎంటీఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.















