ఈతరం భారతం హైద్రాబాద్ సెప్టెంబర్ 19 :
_________________________________
తెలంగాణ గ్రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న రగడ అంతా నాటకమని, ప్రజలను మభ్యపెట్టేందుకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ తరహాలో ఫిక్స్డ్ మ్యాచ్‌లు ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాల ఎనిమిది నెలలు కావస్తున్నా, ఆయన నమ్ముకున్న ఏకైక సూత్రం ‘డైవర్షన్, డిస్ట్రక్షన్, డిమాలిషన్’ అని డాక్టర్ బూర విమర్శించారు. అసెంబ్లీలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై గానీ, 22ఏ నిషేధిత జాబితాలో కోటి ఎకరాలు పెట్టి పేద పట్టాదారులను వేధిస్తున్న విధానంపై గానీ ఎలాంటి చర్చ జరగకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి గ శ్రీధర్ , బాలేష్ , తదితరులు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా.. బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో.. పార్టీ శ్రేణులు హిల్ట్ (HILT) పాలసీ కుంభకోణం, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, కరెంట్ కోతలు, ఎల్ఐసీ, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేస్తుంటే.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ అసెంబ్లీని ఒక అపహాస్యం (Mockery)గా మార్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సభను మాకరీ చేస్తే, ప్రతిపక్ష బీఆర్ఎస్ కేవలం మాక్ అసెంబ్లీలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ‘మేము కొట్టినట్లు చేస్తాం.. మీరు ఏడ్చినట్లు నటించండి’ అన్న రీతిలో ఉభయ పార్టీలు క్లాస్ రూమ్ తరహా రాజకీయాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రజా సమస్యలపై కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, బీజేపీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నేతలు అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సభ్యత, సంస్కారం మరిచి బీజేపీ నాయకులపై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆ వ్యాఖ్యలు శోచనీయమన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ హోదా కంటే సీఎం పీఆర్వో తరహాలోనే వ్యవహరిస్తున్నారని, గెలిచి ఇన్నేళ్లయినా భువనగిరి నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి బీఆర్ఎస్ను గద్దె దించింది ఆనాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నేతృత్వంలోని బీజేపీయేనని, ఆ పోరాట ఫలితంగానే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారనే నిజాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్, హరీష్ రావు సిద్దిపేట ఇళ్ల చుట్టూ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లడం ఒక పొలిటికల్ పిక్నిక్ లాగా మారిందే తప్ప, చట్టపరమైన చర్యలు శూన్యమని బూర నర్సయ్య గౌడ్ గారు విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో వందల ఎకరాల అక్రమ భూములు ఉన్నాయని లైవ్ పెట్టి చెప్పిన ముఖ్యమంత్రి.. నేడు ఫామ్‌హౌస్ లోపలికి వెళ్లి సర్వే చేయించే దమ్ములేక ‘బీటింగ్ అరౌండ్ ది బుష్’ చందంగా చుట్టుపక్కల సర్వేలు చేయిస్తూ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. గుండెపోటు వస్తే అపెండిక్స్ ఆపరేషన్ చేసిన చందంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, అనుముల కుటుంబం–కల్వకుంట్ల కుటుంబం మధ్య జరుగుతున్నది పరిపాలనా బదిలీ మాత్రమే కాదని, ఆస్తుల బదిలీ అని ఆరోపించారు. నిజాయితీ ఉంటే క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలేదని, పీఎంఎల్ఏ చట్టం కింద అక్రమ నగదు లావాదేవీలపై విచారణ ఎందుకు కోరడం లేదని నిలదీశారు.
రంగారెడ్డి జిల్లాలో భూదందాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, రంగారెడ్డి జిల్లా పేరును రేవంత్ రెడ్డి జిల్లాగా, ఇబ్రహీంపట్నం పేరును ‘అనుములపట్నం’గా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. గతంలో ఫార్మా సిటీ, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, రేడియల్ రోడ్ల పేరుతో దాదాపు 50 వేల ఎకరాల మేర వక్ఫ్, అసైన్డ్, ఎవాక్యూ ల్యాండ్స్‌ను కాగితపు కంపెనీల ముసుగులో కాజేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. నిర్దిష్టంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మునగనూరు గ్రామంలో నిజాం కాలం నాటి సర్వే నెంబర్ 44/1, 44/10లలోని రూ. 300 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే గోపాల్ అనే వ్యక్తి పేరిట ప్రైవేటు భూమిగా బదలాయించారని ఆధారాలతో సహా పేర్కొన్నారు. ఈ భూదందాల వెనుక అనుముల బ్రదర్స్, చామల బ్రదర్స్ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన ప్రతి భూదందాపై లెక్క తేలుస్తామని, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా భూమి ఎక్కడికీ పోదని, అక్రమంగా మార్చిన పట్టాలు, ప్రొహిబిషన్ లిస్టులన్నింటినీ రద్దు చేసి పేదలకు, ప్రభుత్వానికి చెందేలా చేస్తామని స్పష్టం చేశారు. భూ కబ్జాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపై సీఐడీ, ఈడీ, సీబీఐ విచారణలు చేయించి జైలుకు పంపడం ఖాయమని హెచ్చరిస్తూ, రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ నేతలు సభ్యతతో మాట్లాడాలని హితవు పలికారు.















