ఈ తరం భారతం ఖమ్మం, అక్టోబర్ – 18:
సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపం, ప్రకృతిని అమ్మగా కొలిచే పండుగ బతుకమ్మ అని డిఆర్డీఏ శ్రీరాం అన్నారు.
తొమ్మిదవ రోజు ఆదివారం సాయంత్రం ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో అట్టహాసంగా, ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలలో పెద్ద ఎత్తున మహిళలు, ఉద్యోగులు పాల్గొని ముందుగా గౌరమ్మ తల్లికి పసుపు, కుంకుమ తో పూజించి మహిళలతో కలిసి మెలసి బతుకమ్మ ఆడి వారిని ఉత్తేజపరిచారు. తొమ్మిది రోజుల పాటు గౌరమ్మను కొలుచుకొంటూ బతుకమ్మలు పేర్చి ఆడుతూ, పాడుతూ మహిళలు సంబురంగా అమ్మవారిని కొలుస్తూ సంతోష వాతావరణంలో పండుగ నిర్వహించారు.
ఈ బతుకమ్మ వేడుకలలో జిల్లాలోని వివిధ వర్గాల మహిళలంతా కలిసికట్టుగా పాల్గొన్నారు. బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…. అంటూ ఆట పాటలతో సందడి చేసారు.
ఈ వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, మహిళా ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.















