EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు – పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ

ఈతరం భారతం తిరుపతి అక్టోబర్ 28 రిపోర్టర్ మనోజ్ కుమార్

_________________________________________________

జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులను అప్రమత్తం చేయడం లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,  నేతృత్వంలో బుధవారం పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బైరాగిపట్టెడలోని ఎంజీఎం స్కూల్ వద్ద ప్రారంభమైన ఈ మార్చ్ టీవీఎస్ షోరూం, లక్ష్మీపురం సర్కిల్ మీదుగా పోస్టల్ కాలనీ వరకు కొనసాగింది.

ఈ ఫ్లాగ్ మార్చ్‌లో స్పెషల్ పార్టీ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బంది, స్థానిక పోలీసులు, బ్లాక్ కమాండోలు, ఎస్టీఎఫ్ (STF) సిబ్బంది తదితర పోలీస్ బలగాలు పాల్గొన్నాయి. ఎన్నికల సమయంలో పోలీస్ శాఖ అప్రమత్తతను చాటడంతో పాటు, ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం ఈ ఫ్లాగ్ మార్చ్ ప్రధాన ఉద్దేశం.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎన్నికల విధుల నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా ఉంచాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

జిల్లాలో జరగనున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అందుబాటులో ఉన్న పోలీస్ బలగాలను సమర్థవంతంగా వినియోగించేలా బందోబస్తు ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా ఎస్పీ  తెలిపారు. జిల్లా పోలీస్ బలగాలతో పాటు అందుబాటులో ఉన్న ఏపీఎస్పీ (APSP) సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తూ, అవసరానికి అనుగుణంగా బలగాలను సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే విడతలో జరగనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న బలగాలను సమర్థవంతంగా వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అవసరాన్ని బట్టి బలగాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించి విధుల్లో నియమించేలా కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ  అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్లు, 200 మీటర్ల పరిధికి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటర్లను ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసినా, ప్రలోభాలకు గురిచేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సులను అందుబాటులో ఉంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు.ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అవసరమైన భద్రత కల్పిస్తుందని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధనపు ఎస్పీలు, శ్రీనివాసులు (పరిపాలన) రవి మనోహర్ ఆచారి (శాంతిభద్రతలు) శ్రీనివాసరావు (సాయుధ దళం) మరియు డిఎస్పీలు సిఐలు ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top