ఈతరంభారతం హైదరాబాద్ అక్టోబర్ 28:
________________________________
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులపై ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యంతోపాటు ఆరు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కందిపప్పు, పామాయిల్, చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండిని అందించే అంశంపై కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని 1.06 కోట్ల ఆహార భద్రత కార్డుల పరిధిలో ఉన్న 3.42 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్, నిల్వలు, పంపిణీ పరిమాణంపై ప్రభుత్వం లెక్కలు వేస్తోంది.
సన్నబియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని యోచిస్తోంది. కందిపప్పు, పామాయిల్, చింతపండు, కారంపొడి, చక్కెర, గోధుమపిండిని అందించే అంశంపై ప్రాథమికంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే సంక్రాంతి నుంచి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద అర్హులైన కుటుంబాలకు సన్నబియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారు. కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బియ్యంతోపాటు చక్కెర, గోధుమలు, సబ్బులు సహా పలు నిత్యావసర వస్తువులను రేషన్ దుకాణాల ద్వారా అందించేవారు. ఇప్పుడు అదే తరహాలో పేదలకు నిత్యావసరాల భరోసా కల్పించే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బియ్యంతోపాటు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని గతంలో ప్రకటించింది.రాష్ట్రంలో ప్రస్తుతం 1.06 కోట్ల ఆహార భద్రత కార్డులు ఉండగా.. వాటి పరిధిలో సుమారు 3.42 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా దాదాపు 2.18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ భారీ లబ్ధిదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని బియ్యంతోపాటు ఇతర వస్తువుల పంపిణీకి ఎంత వ్యయం అవుతుంది ? ఏయే వస్తువులను ఎంత పరిమాణంలో అందించాలి ? పంపిణీని నెలవారీగా చేపట్టాలా, లేక నిర్దిష్ట కాలవ్యవధిలో అందించాలా ? అనే అంశాలపై ప్రభుత్వం లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.ప్రతిపాదిత పథకం అమలుకు అవసరమైన నిత్యావసర వస్తువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా ? లేకుంటే వాటిని ఎలా సేకరించాలి ? కొనుగోళ్లకు ఎంత బడ్జెట్ కేటాయించాలి ? వంటి అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి. బియ్యంతోపాటు ఆరు రకాల నిత్యావసరాలను అందించే ఆలోచన ఉన్నప్పటికీ, వాటి పరిమాణం, ధరలు, పంపిణీ విధానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ వివరాల ఆధారంగానే పథకం అమలు ఖర్చును అంచనా వేయనున్నారు.మరోవైపు, ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రతరం కావచ్చన్న ఆందోళనలు, వ్యవసాయంపై వాటి ప్రభావం పేద కుటుంబాల జీవన వ్యయాన్ని మరింత పెంచే ప్రమాదం ఉన్నాయి. యాసంగి సీజన్‌లో పంటల సాగు పరిస్థితులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాగు పరిస్థితులపై మరో రెండు నెలలు వేచి చూసిన తర్వాత నిత్యావసరాల పంపిణీపై ముందడుగు వేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే సంక్రాంతి నాటికి పథకాన్ని ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పథకం అమలులోకి వస్తే మార్కెట్‌లో ధరలు పెరిగిన సమయంలో పేద కుటుంబాలకు కొంత ఉపశమనం లభించడంతోపాటు ఆహార భద్రత బలోపేతం కావచ్చని భావిస్తున్నారు. అయితే పథకం ఖరారు, అమలు తేదీపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వెలువరించాల్సి ఉంది.















