EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రైలు ప్రయాణికులకు అలర్ట్..!

ఈతరం భారతం న్యూఢిల్లీ అక్టోబర్ 28:

_______________________________

రైలు ప్రయాణికులకు అలర్ట్..!రాత్రి వేళల్లో ఛార్జింగ్ పాయింట్లు బంద్..!! దేశవ్యాప్తంగా నడుస్తున్న అన్ని రైళ్లలో మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంక్ లు, లాప్ టాప్‌ల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్న కేసులు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్యపై దృష్టి సారించి, రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే బోర్డు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11:00 గంటల నుంచి తెల్లవారుజామున 5:00 గంటల మధ్య రైలు బోగీల్లోని అన్ని మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లను పూర్తిగా మూసివేయాలని (స్విచ్ఛాఫ్ చేయాలని) స్పష్టం చేస్తూ దేశంలోని అన్ని రైల్వే జోన్లకు సర్క్యులర్ పంపింది. ఇటీవల ముంబై లోకల్ రైలులో ఛార్జింగ్ పెడుతుండగా ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ పేలిపోయి కోచ్ అంతటా దట్టమైన పొగ వ్యాపించిన ఘటన తీవ్ర కలకలం రేపిన నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి వేళల్లో 6 గంటల పాటు ఛార్జింగ్ సాకెట్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసేలా సంబంధిత సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని, అధికారులు నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ భద్రతా నియమాలను అమలు చేయడంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించింది. వాస్తవానికి రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్‌పై నిబంధనలను 2014లోనే ప్రవేశపెట్టినప్పటికీ, తాజా అగ్ని ప్రమాద ముప్పుల నేపథ్యంలో వీటిని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది. రాత్రి సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడం వల్ల మొబైల్స్, పవర్ బ్యాంకుల ఓవర్ హీటింగ్, విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు జరిగితే వెంటనే గుర్తించడం కష్టతరమవుతుందని, ఇది పెను అగ్నిప్రమాదాలకు దారితీసే అవకాశముందని అధికారులు వివరించారు. భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించేందుకు తీసుకున్న ఈ ముందస్తు జాగ్రత్త చర్యలకు ప్రయాణికులు సహకరించాలని కోరారు. నిబంధనలు పాటించని సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయని రైల్వే శాఖ తేల్చి చెప్పింది.

Related News

Select the Topic
Scroll to Top