EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి

ఈతరం భారతం తిరుపతి, అక్టోబర్ 29 రిపోర్టర్ మనోజ్ కుమార్

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఐఏఎస్ ఆదేశించారు.గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్,ఐఏఎస్.,,జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో కలిసి మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్, బ్యాలెట్ బాక్సుల భద్రత, కౌంటింగ్ తదితర అంశాలపై రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, ఇతర సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులకు ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (APO), ఇతర పోలింగ్ అధికారులు (OPO)గా నియమితులైన సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, అనుమతి లేకుండా గైర్హాజరైనా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

పోలింగ్‌కు ముందస్తు ఏర్పాట్ల నుంచి పోలింగ్ నిర్వహణ, బ్యాలెట్ బాక్సుల భద్రత, స్ట్రాంగ్ రూమ్‌ల నిర్వహణ, కౌంటింగ్ వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫార్మాట్లలో అవసరమైన పత్రాలను పూర్తి చేసి, సక్రమంగా సిద్ధం చేయాలని తెలిపారు. మైక్రో అబ్జర్వర్ల నివేదికలు సహా కీలక పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.బ్యాలెట్ బాక్సులను నిబంధనల ప్రకారం సీల్ చేసి, పటిష్ట భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించాలని ఆదేశించారు. అభ్యర్థులు లేదా వారి అధీకృత ప్రతినిధుల సమక్షంలో నిబంధనల ప్రకారం భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ, అవసరమైన చోట్ల వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. కౌంటింగ్ రోజున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, స్ట్రాంగ్ రూమ్‌లను తెరవడం నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడం వరకు ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డుల జారీ, ప్రవేశ నియంత్రణను ఎన్నికల నిబంధనల ప్రకారం చేపట్టాలని తెలిపారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకానికి సంబంధించిన జాబితాలను పరిశీలించే సమయంలో వారి అర్హతలను నిబంధనల ప్రకారం ధ్రువీకరించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ ప్రక్రియలో రాజకీయ పక్షపాతానికి తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం అనర్హులైన వారికి అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు.ఓటర్ స్లిప్పులు సంబంధిత రిటర్నింగ్ అధికారి (RO) లాగిన్‌లో అందుబాటులోకి వచ్చిన వెంటనే డౌన్‌లోడ్ చేసి, ముద్రించి ఓటర్లకు సకాలంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఓటరికి ఎన్నికలకు సంబంధించిన అవసరమైన సమాచారం అందేలా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ఎన్నికల సమయంలో రిగ్గింగ్, ఓటర్లను ప్రలోభపెట్టడం, ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం వంటి అక్రమాలను సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై అందే ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ, వెబ్‌కాస్టింగ్ వ్యవస్థలను సమర్థంగా వినియోగించాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి తాగునీరు, ఆహారం, రాత్రి బస వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, పోలింగ్‌కు ముందు రోజు జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు.

ఈసందర్బంగా తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, జిల్లాలో జరగనున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) మార్గదర్శకాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC)ను ఖచ్చితంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.

గతంలో సమస్యలు తలెత్తిన ప్రాంతాలు, హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్‌ను మోహరించి, నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నట్లు వెల్లడించారు.ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సుల తరలింపు, పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం, కౌంటింగ్ పూర్తయ్యే వరకు పటిష్ట భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఏఆర్ (AR) సిబ్బంది, ప్రత్యేక బలగాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియో కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల సమయంలో ఎక్కడైనా సమస్యలు లేదా అవాంఛనీయ ఘటనలు తలెత్తితే తక్షణమే స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో భద్రతా చర్యలను అమలు చేస్తున్నట్లు వివరించారు.

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, మీడియా ప్రతినిధులు పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, శ్రీనివాసులు (పరిపాలన,) రవి మనోహరాచారి,(శాంతి భద్రతలు) ఐ రామకృష్ణ,(తిరుమల) శ్రీమతి శ్రీలత,(క్రైమ్)శ్రీనివాసరావు,

(సాయుధ దళం) మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top