EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గూడారు జగదీష్

ఈతరంభారతం తిరుపతి అక్టోబర్ 31 రిపోర్టర్ మనోజ్ కుమార్:

శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) నందు విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా శ్రీ పద్మావతి ఆడిటోరియం విజిలెన్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు, ఉపకులపతి డాక్టర్ గూడారు జగదీష్ నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనం కలిగిన పరిపాలన ద్వారానే సంస్థాగత అభివృద్ధి సాధ్యమవుతుందని, అవినీతి రహిత వ్యవస్థతోనే ప్రజల్లో ప్రభుత్వ సంస్థలపై విశ్వాసం పెరుగుతుందని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గూడారు జగదీష్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు–2026 సందర్భంగా స్విమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది “Probity for Prosperity” (సమృద్ధి కోసం నిజాయితీ) అనే ఇతివృత్తం ఎంతో ప్రాధాన్యత కలిగినదని తెలిపారు.

విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు కేవలం ఒక కార్యక్రమానికి పరిమితం కాకుండా, ప్రతి ఉద్యోగి తన విధి నిర్వహణలో నైతిక విలువలు, నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుత ప్రవర్తనలను పాటించేందుకు ఆత్మపరిశీలన చేసుకునే సందర్భమని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు ఉన్నప్పటికీ, వాటి నిర్వహణలో నిజాయితీ, బాధ్యత, పారదర్శకత లేకపోతే సంస్థ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించలేమని వివరించారు.

విజిలెన్స్ అనేది కేవలం విజిలెన్స్ విభాగానికి సంబంధించిన అంశం కాదని, వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఇంజినీర్లు, పరిపాలనా అధికారులు, అకౌంట్స్ సిబ్బంది, కొనుగోళ్ల విభాగం ఉద్యోగులు మొదలుకొని పారిశుద్ధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కరి బాధ్యత అని డాక్టర్ జగదీష్ గారు స్పష్టం చేశారు. విధులను నిబద్ధతతో నిర్వహించడం, రికార్డులను సక్రమంగా నిర్వహించడం, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం కాకుండా చూడటం, రోగులకు వివక్ష లేకుండా సేవలందించడం కూడా విజిలెన్స్‌లో భాగమేనని తెలిపారు. తప్పు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, తప్పులు జరగకుండా ముందుగానే నివారించడమే ఉత్తమ విజిలెన్స్ విధానమని పేర్కొన్నారు.కేంద్ర విజిలెన్స్ కమిషన్ సూచించిన నివారణాత్మక విజిలెన్స్ కార్యక్రమంలో ఐదు ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన వివరించారు.

పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారం: ఉద్యోగులు, రోగులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలి.

పెండింగ్ కేసుల పరిష్కారం: పరిపాలనా, క్రమశిక్షణ, విజిలెన్స్ తదితర కేసులను సమీక్షించి, అనవసర జాప్యం లేకుండా నిబంధనల ప్రకారం పరిష్కరించాలి.

సిబ్బంది సామర్థ్య పెంపు: ఆర్థిక, పరిపాలనా, సేవా నిబంధనలపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. సరైన అవగాహనతో అనేక పరిపాలనా తప్పిదాలను నివారించవచ్చని తెలిపారు.

డిజిటల్ విధానాల బలోపేతం: రోగుల నమోదు, బిల్లింగ్, ఔషధాల పంపిణీ, కొనుగోళ్లు, ఆర్థిక లావాదేవీలు, సిబ్బంది పరిపాలన తదితర అంశాల్లో డిజిటల్ విధానాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు.

కాంట్రాక్టుల నిర్వహణ: వైద్య పరికరాలు, మందులు, శస్త్రచికిత్సకు అవసరమైన సామగ్రి, ల్యాబ్ రీ ఏజెంట్స్, పారిశుద్ధ్యం, భద్రత, ఇంజినీరింగ్ పనులు, నిర్వహణ సేవలకు సంబంధించిన కొనుగోళ్లు, ఒప్పందాల్లో నాణ్యత, పారదర్శకత, న్యాయబద్ధత పాటించాలని సూచించారు. ప్రతి రూపాయి ప్రజాధనం సక్రమంగా వినియోగమై సంస్థకు తగిన ప్రయోజనం చేకూర్చాలని తెలిపారు.

వైద్య సంస్థల్లో విజిలెన్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత:

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అనేక మంది రోగులు చికిత్స కోసం సుదూర ప్రాంతాల నుంచి స్విమ్స్‌కు వస్తుంటారని, వారికి చిన్నపాటి పరిపాలనా జాప్యం కూడా పెద్ద ఇబ్బందిగా మారుతుందని డాక్టర్ జగదీష్ పేర్కొన్నారు. అందువల్ల రోగులకు వివక్ష లేకుండా గౌరవప్రదమైన, సకాలంలో నాణ్యమైన వైద్యసేవలు అందించడం, ప్రభుత్వ నిధులు, మందులు, వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను బాధ్యతాయుతంగా వినియోగించడం, సంస్థ ప్రతిష్ఠను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

అన్ని విభాగాలు జవాబుదారీతనంతో పనిచేయాలి:

స్విమ్స్‌లోని అన్ని విభాగాలు అవినీతిపై ఏమాత్రం ఉపేక్ష చూపకుండా పనిచేయాలని, పెండింగ్ ఫైళ్లు, అనుమతులు, ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఖర్చుకు తగిన సమర్థన, అనుమతి, రికార్డు ఉండాలని, మందులు, వైద్య పరికరాలు, ఇతర వనరులు వృథా కాకుండా సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తన విధుల పట్ల బాధ్యత వహిస్తూ, రోగుల పట్ల మానవత్వం, సేవాభావం, గౌరవంతో వ్యవహరించాలని కోరారు. అంతర్గత ఆడిట్లు, విభాగాల వారీ సమీక్షలు, ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని తెలిపారు.

*నిజాయితీనే స్విమ్స్ గుర్తింపుగా నిలవాలి:

పరిపాలనలో నిజాయితీ, వ్యవస్థలో పారదర్శకత, విధి నిర్వహణలో జవాబుదారీతనం, వైద్యసేవల్లో మానవత్వం కలిసినప్పుడే సంస్థాగత నాణ్యత, ప్రజల విశ్వాసం శాశ్వతంగా నిలుస్తాయని తెలిపారు.

“Probity for Prosperity” అనే ఇతివృత్తాన్ని కేవలం నినాదంగా కాకుండా, ప్రతి నిర్ణయంలో, ప్రతి లావాదేవీలో, ప్రతి విభాగంలో, ప్రతి రోగికి అందించే సేవలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. స్విమ్స్‌ను నైతిక విలువలు, పారదర్శక పరిపాలన, నాణ్యమైన వైద్యసేవలకు ఆదర్శ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని కోరారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన అకౌంట్స్ విభాగం మరియు నిర్వాహకులను అభినందించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నివారణాత్మక విజిలెన్స్ కార్యక్రమాల్లో స్విమ్స్ కుటుంబ సభ్యులందరూ చురుకుగా పాల్గొని సంస్థ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.నిజాయితీ మన గుర్తింపుగా, పారదర్శకత మన బలంగా, జవాబుదారీతనం మన సంస్కృతిగా, రోగుల సంక్షేమం మన పరమావధిగా స్విమ్స్ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్ గారు విజిలెన్స్ అవేర్నెస్ వీక్ లో భాగంగా స్విమ్స్ ఉద్యోగుల చేత ప్రతిజ్ఞ చేపించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన నిరంజన్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, తిరుపతి గారిని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ గుడారు జగదీష్ గారు శాలువాతో సత్కరించి, మెమెంటో బహూకరించారు.   ఈ కార్యక్రమానికి స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్, డాక్టర్ రామ్, ముఖ్యఅతిధి నిరంజన్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ మాధవి, డాక్టర్ శర్వాణి, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ గోపి మరియు వివిధ విభాగాధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top