ఈతరంభారతం ఖమ్మం అక్టోబర్ 31:
—————————————
రాష్ట్ర ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ ఆదేశాల ప్రకారం, జిల్లాలోని రైస్ మిల్లర్లు, హోల్ సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు, విక్రయ కేంద్రాలు బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరలకే విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 26 కిలోల బ్యాగ్ ప్యాక్ బియ్యానికి కిలోకు గరిష్ట చిల్లర ధరలు బిపిటి (BPT) / కెఎన్ఎం (KNM) కిలో రూ. 66/-, ఆర్ఎన్ఆర్ (RNR) / తెలంగాణ సోనా కిలో రూ. 74/-, హెచ్ఎంటీ (HMT) / జెఎస్ఆర్ (JSR) కిలో రూ. 79/-గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ధరల వివరాలతో కూడిన ప్రభుత్వ బ్యానర్ ను రైస్ మిల్లర్లు, హోల్ సేల్, రిటైల్ వ్యాపారులు, విక్రయ కేంద్రాల వద్ద వినియోగదారులకు కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ (పౌర సరఫరాలు) ఆదేశాల మేరకు, జిల్లా పౌర సరఫరాల అధికారి పట్టణంలోని బియ్యం విక్రయ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధరలకే బియ్యాన్ని విక్రయించాలని, ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విక్రయదారులను హెచ్చరించారు. ధరల పట్టిక ప్రదర్శనలో లేదా నిర్ణయించిన ధరల అమలులో ఉల్లంఘనలు గుర్తిస్తే సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వినియోగదారులు ఎవరైనా నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే, ఆ విషయాన్ని వెంటనే జిల్లా పౌర సరఫరాల అధికారి కార్యాలయం, ఖమ్మం దృష్టికి తీసుకురావాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.















