ఈతరం భారతం రంగారెడ్డి జిల్లా నవంబర్ 14:
మునగనూరులో ప్రభుత్వ భూముల పరిరక్షణకు బీజేపీ పోరాటం ఫలించిందని మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్ మున్సిపాలిటీ ప్రస్తుత తొర్రూరు డివిజన్ పరిధిలోని మునగనూరులో సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని మున్సిపల్ అధ్యక్షులు ఎలిమినేటి నరసింహ రెడ్డి గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ప్రభుత్వ భూములను కాపాడేందుకు బీజేపీ శ్రేణులతో కలిసి నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ భూములు భూ బకాసురుల కబ్జాలకు గురికాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ నిరంతర పోరాటం ఫలితంగా ప్రభుత్వంలో చలనం వచ్చి సదరు భూమి చుట్టూ కొంత మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం. అయితే ఇంకా పూర్తిస్థాయిలో కంచె ఏర్పాటు చేయలేదు. మిగిలిన భూమికి కూడా వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిస్థాయిలో రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా RR Tax నడుస్తుంటే, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో RRR Tax నడుస్తోందని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్న భూ బకాసురులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ ప్రభుత్వ భూములు, వాటి సర్వే నంబర్లు ఎక్కడికీ పోవు.. మాయమవ్వవు. ఈరోజు అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినంత మాత్రాన అవి శాశ్వతంగా సొంతమైపోవు.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారు ఎవరైనా సరే చట్టప్రకారం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
12 ఎకరాల ప్రభుత్వ భూమి పేదల సంక్షేమానికి ఉపయోగపడాలి!
మునగనూరులోని 12 ఎకరాల ప్రభుత్వ భూమిని పూర్తిస్థాయిలో పరిరక్షించి ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తామని తెలిపారు. ఆ భూమిలో ఆసుపత్రి, పార్క్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ టవర్స్ నిర్మించి పేదలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, సొంత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. అలాగే అర్హులైన మీడియా మిత్రులకు కూడా ఇళ్ల కేటాయింపులో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
ప్రభుత్వ భూములు భూ బకాసురుల ఆస్తులు కావు.. అవి ప్రజల ఆస్తులు. వాటిని కాపాడి పేద ప్రజల సంక్షేమానికి వినియోగించడమే బీజేపీ లక్ష్యం. మునగనూరులోని 12 ఎకరాల ప్రభుత్వ భూమికి పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసే వరకు, భూ కబ్జాదారులపై చర్యలు తీసుకునే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోసుపల్లి ప్రతాప్, పాపయ్య గౌడ్, కొత్త రామ్ రెడ్డి, బాచిగాళ్ళ రమేష్, తూళ్ల నరసింహ గౌడ్, కందాల బల్దేవ్ రెడ్డి, అర్జున్ గౌడ్, కారడి అనిల్, నోముల కార్తిక్ గౌడ్, కొంతం బల్ రెడ్డి, అడ్వకేట్ వీణ, యంజాల శ్రీనివాస్ రెడ్డి, నందగిరి సురేష్, కొలన్ రవీందర్ రెడ్డి, ఆరేని నాగరాజు, జ్ఞానేశ్వర్ చారీ, రాజేశ్వరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు















