ఈతరం భారతం అమరావతి అంధ్ర ప్రదేశ్ నవంబర్ 14:
18న అర్ధరాత్రి తీరం దాటే అవకాశం బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల రైతుల్లో ఆందోళన మొదలైంది. నవంబర్ 16 నాటికి తుపానుగా బలపడే అవకాశం ఉందని అంచనాలు వస్తుండగా, 18 లేదా 19 తేదీల్లో మచిలీపట్నం–గోపాలపూర్ మధ్య తీరం దాటవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘అర్నాబ్’, ‘మురసు’ తుపాన్లతో 4.61 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మరో తుపాను వస్తే చేతికొచ్చే దశలో ఉన్న వరి, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.కోస్తా తీరంపై ప్రకృతి పగబట్టింది. వరుస తుపాన్లతో రాష్ట్రం కోలుకోలేని నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికే రెండు తుపాన్లు అతలాకుతలం చేశాయి. ఇప్పుడు మరో తుపాను హెచ్చరికతో రైతాంగంలో భయాందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ చివరి వారంలో విరుచుకుపడిన ‘అర్నాబ్’, నవంబర్ ప్రారంభంలో బీభత్సం సృష్టించిన ‘మురసు’ తుపానులు మిగిల్చిన విషాదం నుంచి కోస్తాంధ్ర ఇంకా తేరుకోలేదు. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో ఉత్తర కోస్తా జిల్లాల్లో మళ్లీ అలజడి మొదలైంది.















