EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హైదరాబాద్‌లో రూ.500 కోట్లతో 300 పడకల ఆస్టర్ హాస్పిటల్

ఈతరం హైదరాబాద్‌, నవంబర్‌ 14:

హైదరాబాద్‌లో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్‌ మరో ముందడుగు వేసింది. కొండాపూర్ లో రూ.500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న 300 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్టర్ హాస్పిటల్‌ను 2027 మార్చి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించింది. సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్ ఆజాద్ మూపెన్ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. కొత్త హాస్పిటల్‌ అందుబాటులోకి వస్తే నగరంలో సంస్థ నిర్వహిస్తున్న హాస్పిటళ్ల సంఖ్య ఎనిమిదికి చేరడంతో పాటు మొత్తం పడకల సామర్థ్యం 1,700 దాటనుంది.

దేశవ్యాప్తంగా వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రత్యేక వైద్య సేవలను మరింత మందికి చేరువ చేయడం లక్ష్యంగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ విస్తరణ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న హాస్పిటళ్ల విస్తరణ, కొత్త హాస్పిటళ్ల నిర్మాణం, అవసరమైన చోట ఇతర హాస్పిటళ్ల కొనుగోలుపై దృష్టి సారించింది. పెరుగుతున్న వైద్య అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దీర్ఘకాలికంగా స్థిరమైన హాస్పిటళ్ల వ్యవస్థను అభివృద్ధి చేయాలని సంస్థ భావిస్తోంది.

రెండేళ్లలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులు: డాక్టర్ ఆజాద్ మూపెన్

ఈ సందర్భంగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్ ఆజాద్ మూపెన్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో పెరుగుతున్న వైద్య అవసరాలను తీర్చాలంటే ఆధునిక వైద్య మౌలిక సదుపాయాలు, ప్రత్యేక చికిత్సలు, నాణ్యమైన వైద్య సేవలపై నిరంతరం పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగా రెండేళ్లలో సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రూపొందించాం. దేశవ్యాప్తంగా కొత్తగా 4 వేల నుంచి 4,400 పడకలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మొత్తం సామర్థ్యాన్ని 15 వేల పడకలకు పైగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం ఉన్న హాస్పిటళ్ల విస్తరణ, కొత్త హాస్పిటళ్ల నిర్మాణం, వ్యూహాత్మక కొనుగోళ్ల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.

హైదరాబాద్‌ విస్తరణపై ప్రత్యేక దృష్టి: వరుణ్ ఖన్నా

ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, గ్రూప్‌ సీఈఓ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ.. ‘‘ప్రజల వైద్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో నాణ్యమైన చికిత్సలను వారికి మరింత చేరువ చేయడమే మా ప్రాధాన్యం. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ప్రత్యేక చికిత్సలను విస్తరించడం, దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా పెట్టుబడులు పెట్టడంపై దృష్టి సారించాం. మా విస్తరణ ప్రణాళికలో హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఇప్పటికే ఉన్న హాస్పిటళ్లను విస్తరించడంతో పాటు కొండాపూర్ లో రూ.500 కోట్లతో కొత్త ఆస్టర్ హాస్పిటల్‌ను అభివృద్ధి చేస్తున్నా మన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేక వైద్య నిపుణులు, మెరుగైన చికిత్సా విధానాలతో ఈ హాస్పిటల్‌ను తీర్చిదిద్దుతున్నాం.

రోగులకు చికిత్సతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం, వ్యక్తిగత శ్రద్ధ, నమ్మకమైన వైద్య సేవలను అందించాలన్నది మా లక్ష్యం. 2027 మార్చిలో సేవలను ప్రారంభించేందుకు అవసరమైన వైద్య, నిర్వహణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. వైద్య సేవల్లో నాణ్యతతో పాటు సంస్థ స్థిరమైన వృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నాం” అని వివరించారు.

ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్‌ ఇండియా-2 సీఈఓ డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా నగర పశ్చిమ ప్రాంతంలో నివాస సముదాయాలు, కార్యాలయాలు పెరుగుతున్న నేపథ్యంలో సమగ్ర వైద్య సేవలకు డిమాండ్‌ అధికమవుతోంది. కొండాపూర్ లో కొత్త ఆస్టర్ హాస్పిటల్‌ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌లో మా హాస్పిటళ్ల సంఖ్య ఎనిమిదికి చేరుతుంది. కుటుంబాలు, ఉద్యోగులు తాము నివసించే, పనిచేసే ప్రాంతాలకు సమీపంలోనే అత్యవసర వైద్యం, క్రిటికల్‌ కేర్‌తో పాటు వివిధ ప్రత్యేక చికిత్సలను సకాలంలో పొందేలా చూడడమే మా లక్ష్యం. ఈ విస్తరణతో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి” అని తెలిపారు.

కొండాపూర్ లో నిర్మిస్తున్న కొత్త ఆస్టర్ హాస్పిటల్‌లో పలు ప్రత్యేక విభాగాలకు సంబంధించిన సమగ్ర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 100 క్రిటికల్‌ కేర్‌ పడకలు, 10 ఆధునిక మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లు, ప్రత్యేక సౌకర్యాలతో కూడిన లగ్జరీ సూట్లు ఏర్పాటు చేస్తున్నారు.

అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐతో పాటు ఎక్మో, ఐవీయూఎస్‌, ఈబీయూఎస్‌, ఈఆర్‌సీపీ వంటి అధునాతన వైద్య సాంకేతిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. రోజులో 24 గంటలూ అత్యవసర వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Related News

Select the Topic
Scroll to Top