ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 14:
అందం , ఆత్మవిశ్వాసం , పట్టుదల , పోరాట పటిమకు ప్రతీకగా నిలుస్తూ ఖమ్మం నగరానికి చెందిన కొత్త లీల ప్రసన్న అరుదైన విజయాలను సొంతం చేసుకున్నారు. *ఇటీవలే వరంగల్‌లో తెలంగాణ ఫ్యాషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో గౌస్ పాషా నేతృత్వంలో నిర్వహించిన మిస్ తెలంగాణ స్పార్క్–2026 పోటీల్లో విజేతగా నిలిచి మిస్ తెలంగాణ–2026, మిస్ ఖమ్మం–2026 అనే రెండు ప్రతిష్ఠాత్మక కిరీటాలను దక్కించుకున్నారు. కేవలం అందాల పోటీలకే పరిమితం కాకుండా క్రీడారంగంలోనూ తన సత్తా చాటుతున్న లీల ప్రసన్న కరాటేలో బ్లాక్ బెల్ట్ రెండో డాన్ సాధించడంతో పాటు రాష్ట్రస్థాయి గ్రాండ్ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నారు. ఇప్పటివరకు సుమారు 40 కరాటే పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు , షీల్డులు సాధించారు. ప్రస్తుతం న్యాయ విద్యను అభ్యసిస్తూనే విద్య , క్రీడలు , ఇతర రంగాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. కీర్తిశేషులు నూనె లక్ష్మీనారాయణ మనవరాలైన లీల ప్రసన్న విజయాల పట్ల పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సాయిబాబా ఆలయ ఛైర్మన్ వేములపల్లి వెంకన్న , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి. చంద్రావతి , సీనియర్ అడ్వకేట్ , వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వర్లు , మాజీ కార్పొరేటర్ పసుమర్తి రామ్ మోహన్ రావు , ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు , గాంధీచౌక్ కిరాణం జాగిరి అసోసియేషన్ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించి అభినందించారు. కుటుంబ సభ్యులు కొత్త శంకర్ , కొత్త విజయలక్ష్మి తో పాటు బంధుమిత్రులు , గాంధీచౌక్ వ్యాపారులు , నగర ప్రముఖులు ఆమె విజయాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి ఖమ్మం నగరానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.















