ఈతరం భారతం తిరుపతి, నవంబర్ 14 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి. రాష్ట్రంలో రానున్న పట్టణ స్థానిక సంస్థలు (ULBs), గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకునేలా, ప్రతి ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
శనివారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నందు రాష్ట్రం లోని 12 జిల్లాల ఎస్ పి లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పట్టణ స్థానిక సంస్థలు (ULBs), గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై ఏడిజి (లా అండ్ ఆర్డర్) మధుసూదన్ రెడ్డి, ఐపిఎస్., ఐజిపి రాజకుమారి ఐపిఎస్., మరియు ఎన్నికల పరిశీలకులు వర ప్రసాద్ లతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ డా. శ్రీ ఎస్.వెంకటేశ్వర్,ఐఏఎస్., జిల్లా ఎస్పి శ్రీ ఎల్.సుబ్బారాయుడు, ఐపిఎస్., అనంతపురం, కర్నూల్ రేంజ్ ఐజిపి లు శ్రీ షిమోషీ ఐపిఎస్., డిఐజీ శ్రీ కే. ప్రవీణ్ ఐపిఎస్., తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వై.ఎస్.ఆర్ కడప, కర్నూల్, నంద్యాల జిల్లాల ఎస్పి లు ఈ సమావేశానికి నేరుగా పాల్గొనగా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్య సాయి, అనంతపురం ఎస్పి లు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్ పి లు తమ జిల్లా పరిధిలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన బందోబస్తు, తదితర వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు వివరించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల పరిరక్షణ అత్యంత కీలకమని, నామినేషన్ల స్వీకరణ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో ఎన్నికల అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా గతంలో అన్నమయ్య జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసున్నాయని, ఎస్పి వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, మరికొన్ని జిల్లాల్లో అధికారులు ఒత్తిళ్ల మధ్య విధులు నిర్వహించినప్పటికీ, ఎన్నికల నిబంధనల అమలులో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. సాధారణ నామినేషన్ కేంద్రాలతో పాటు జిల్లా కలెక్టరేట్‌ను కూడా నామినేషన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా అభ్యర్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించామని వివరించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అత్యంత సమర్థవంతమైన సమన్వయంతో చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభినందించారు. తిరుపతి జిల్లాలో అమలు చేసిన ఈ సమన్వయ విధానం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలని, ఇదే నిబద్ధతతో ప్రతి అభ్యర్థికి భద్రత, ప్రతి ఓటరుకు స్వేచ్ఛ కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రానున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణ నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని కలెక్టర్, ఎస్పీలు భావిస్తే, వెంటనే జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అందుబాటులో ఉన్న పోలీసు బలగాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రతి మండలంలో రెండు లేదా మూడు గ్రామాలను కలిపి క్లస్టర్ స్థాయిలో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి భద్రత కల్పించాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే ప్రతి అభ్యర్థికి అవసరమైన పోలీసు రక్షణ కల్పించాలని, అభ్యర్థులు కోరిన మేరకు భద్రత కల్పించి ఎలాంటి భయం లేదా ఒత్తిడి లేకుండా నామినేషన్లు దాఖలు చేసేలా చూడాలన్నారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ నిఘా, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అందే ఫిర్యాదులు, వినతులను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సంబంధించి అభ్యర్థులు తిరిగి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసిందని తెలిపారు. 2,000 నుంచి 5,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10,000 లోపు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.25 లక్షలు, 10,000కు పైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షలు నగదు ప్రోత్సాహం అందించడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయిన పంచాయతీలకు ఈ ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందన్నారు.
తిరుపతి జిల్లా పరిధిలో ఎన్నికలకు గుర్తింపు పొందిన మొత్తం 777 గ్రామ పంచాయతీల్లో సుమారు 200 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఏకగ్రీవ పంచాయతీల సంఖ్య పెరగడం వల్ల ఎన్నికల బందోబస్తుకు అవసరమైన అదనపు పోలీసు బలగాలను ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. అయితే, ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, బలవంతపు చర్యలకు తావుండకూడదని, ఎన్నికలు పూర్తిగా స్వచ్ఛందంగా, పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును పునఃసమీక్షించి అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఏడిజి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమైందని స్పష్టం చేశారు. గతంలో కడప జిల్లాలో తలెత్తిన శాంతిభద్రతల సమస్యను ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయికి చేరుకుని, సరైన భద్రతా ఏర్పాట్లతో ముందుండి సమర్థవంతంగా నియంత్రించిన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు. అదే స్ఫూర్తితో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో రాబోయే స్థానిక సంస్థలు మరియు గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఐజిపి రాజకుమారి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటివరకు మొత్తం 1,182 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. వీటిలో 254 ప్రత్యక్ష ఫిర్యాదులు, 810 ఈ-మెయిల్స్, 218 ఫోన్ కాల్స్ ద్వారా అందాయి. అత్యధికంగా కడప జిల్లాలో 278, తిరుపతిలో 136, అన్నమయ్యలో 132 ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ సమయంలో అభ్యర్థులపై దాడులు, బెదిరింపులు, అడ్డుకోవడం, కిడ్నాప్, నామినేషన్ పత్రాలను చింపివేయడం వంటి ఫిర్యాదులపై క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించి తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నామినేషన్ కేంద్రాల్లోని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచడంతో పాటు, పోలింగ్ రోజున ఏజెంట్లను అడ్డుకోవడం, విలేకరులపై దాడుల ఘటనలను కూడా తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టినట్లు ఐజీ వివరించారు.















