EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖరీఫ్‌కు తిరుపతి జిల్లాలో ఎరువుల కొరత లేదు

ఈతరం భారతం తిరుపతి జూలై 11 రిపోర్టర్ మనోజ్ కుమార్

ఖరీఫ్–2026 సీజన్‌లో తిరుపతి జిల్లాలో రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని, యూరియా కొరతకు ఎలాంటి అవకాశం లేదని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో 92,620 హెక్టార్లలో వివిధ పంటలు సాగు అవుతున్నాయని, మొత్తం 53,050 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని చెప్పారు. జిల్లాకు జూలై నాటికి 21,929 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, 17,775 మెట్రిక్ టన్నులు ఇప్పటికే రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 14,860 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర సరఫరా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌లు, ప్రైవేట్ డీలర్ల ద్వారా పెద్ద ఎత్తున యూరియా పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో పారదర్శకత పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల నుంచి ఏపీఏఐఎంఎస్ డిజిటల్ విధానాన్ని అమలు చేస్తోందని, యూరియా, డీఏపీ వంటి ఎరువుల కొనుగోలుకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేశామని తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో వివరాలు లేని రైతులను కూడా సాగు వివరాల ఆధారంగా నమోదు చేసి ఎరువులు అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 42,539 మంది రైతులకు 2,26,698 యూరియా బస్తాలు, 16,751 డీఏపీ బస్తాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఎరువులను గరిష్ట చిల్లర ధర కంటే అధిక ధరకు విక్రయించడం, ఇతర ఉత్పత్తులను బలవంతంగా జతచేసి విక్రయించడం వంటి అక్రమాలను ఏమాత్రం సహించబోమని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. అలాంటి ఘటనలు గుర్తిస్తే సంబంధిత డీలర్లపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీలర్ లైసెన్స్‌ను వెంటనే సస్పెండ్ చేస్తామని స్పష్టం చేశారు. రైతులు అధీకృత విక్రయ కేంద్రాల నుంచే ఎరువులు కొనుగోలు చేయాలని, అధిక ధరలు వసూలు చేసినా లేదా ట్యాగింగ్‌కు పాల్పడినా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

Related News

Select the Topic
Scroll to Top