వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కారు తాజాగా జగనన్న పేరుతో మరొక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో పథకం ప్రారంభిస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి పేరు మార్చి జగన్ పేరు పెట్టారు.ఈ మేరకు అఖిల భారత సర్వీసుల కోసం ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు క్వాలిఫై అయిన వారికి వరసగా రూ. లక్షా 50,000 సాయం అంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పథకానికి జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అని పేరు పెట్టడం పట్ల కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. డిగ్రీ స్థాయి నుంచి పునాది వేసుకుని సివిల్ సర్వీస్ కోసం కష్టపడే అభ్యర్ధులు ప్రిలిమ్స్ పరీక్షకు సెలెక్ట్ అయిన తర్వాతే ప్రోత్సాహకమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి సాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 58 ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. పథకం లబ్ధి కోసం విధివిధానాలను వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.