ఈతరం భారతం తిరుపతి:జూలై 28 రిపోర్టర్ మనోజ్ కుమార్
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (ఎస్‌వీ యూనివర్సిటీ)లో ఈరోజు డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆర్కే రోజా భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని ఆరోపించారు. పారదర్శకంగా నిర్వహించాల్సిన మెగా *డీఎస్సీని “దగా డీఎస్సీ”* గా మార్చేశారని విమర్శించారు.నీట్ పరీక్షలో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అదే ప్రమాణం ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్తించాలని అన్నారు. డీఎస్సీపై వచ్చిన ప్రతి ఆరోపణపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.ఎస్‌సీఈఆర్‌టీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తికి అత్యున్నత ర్యాంకు రావడం, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలు, మెరిట్ జాబితాల ప్రకటనలో పారదర్శకత లేకపోవడం, టీచర్ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందేనని అన్నారు.
టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగాయనే వీడియోలు బయటకు వచ్చినా, ఫిర్యాదులు ఉన్నా, అసలు సూత్రధారులను ఎందుకు బయటకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్న నిరుద్యోగులను బెదిరించడం, క్రిమినల్ కేసుల హెచ్చరికలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. నిరుద్యోగ యువత గొంతును అణచివేయడం కాకుండా వారి అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.డీఎస్సీ అక్రమాల వల్ల బాధితులైన అభ్యర్థులు స్వయంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. నిజం తమ వైపు ఉంటే సీబీఐ దర్యాప్తుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
అలాగే రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపిస్తూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, విద్యార్థి సంక్షేమ పథకాల అమలులో వైఫల్యాలపై కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు.చివరిగా, డీఎస్సీ నియామకాలపై వచ్చిన ప్రతి ఆరోపణపై సమగ్ర సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు.
ఈ నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని నినాదాలు చేశారు.















