ఈతరం భారతం హైదరాబాద్ జూలై 29 ( రాగి సహదేవ్ ) ( మహేశుని లక్ష్మయ్య )
రాష్ట్రంలో 70 లక్షలకు పైగా జనాభా ఓట్ల బలమున్న మాదిగ జాతికి అన్ని రాజకీయ పార్టీలు అనాదిగా అన్యాయం చేస్తూనే వస్తున్నాయని… ఇప్పటికైనా మనం ఏకమవుదామనిమాదిగలకు మాజీ మంత్రి, మాదిగ మహాశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపు నిచ్చారు.అన్నిట్లోనూ అన్యాయమే…జరుగుతుంది.జనాభా దామాషా ప్రకారం సీట్ల కోసం పోరాడుదాం.. రాజ్యాధికారం కోసం చేయి చేయి కలుపుదాం అని అన్నారు.
అన్నిట్లోనూ అన్యాయమే…
రెడ్ల జనాభా ఎంత?.. వారికి 43 అసెంబ్లీ సీట్లు ఎలా ఇచ్చారు.. 70 లక్షల జనాభా ఉన్న మాదిగలకు న్యాయంగా 19 సీట్లు దక్కాలి.. నామ మాత్రపు సీటు ఇచ్చి చేయి దులుపుకున్నారు… మూడు ఎంపీ సీట్లకు గాను ఒక సీటు కూడా మాదిగలకు ఇవ్వలేదు.. ఇక ఎమ్మెల్సీ సీట్లు ఒక్కటి కూడా మాదిగలకు కేటాయించక అవమానపరిచారు.. ఇది అన్యాయం కాదా అని అన్ని రాజకీయ పార్టీలను మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. అటు పార్లమెంట్లో గానీ ఇటు శాసనసభ శాసనమండలిలో గాని మాదిగలకు కల్పించిన స్థానం ఎంత అని ఆయన ఆవేదనతో చెప్పుకొచ్చారు .
ఓట్లు మావి… సీట్లు మీవా?
పార్టీల జెండాలు మోసి… ఓట్లు వేసి… గెలిపిస్తే మాదిగలకు వారు చేస్తున్న న్యాయం ఎంత?.. పాలకులు, ప్రతిపక్షాలు ఆత్మ విమర్శ చేసుకోవాలి… మాదిగలు రాజకీయ శక్తిగా ఎదగక పోవడానికి కారణం ఎవరు?.. ఇక ఈ అన్యాయాన్ని సహించేది లేదు.. ఉద్యమిస్తాం.. న్యాయం కోసం పోరాడుతాం అని మోత్కుపల్లి అన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు… రాబోవు అన్ని ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం మాదిగలకు సీట్లు కేటాయించాలి అని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. వాస్తవంగా మాది డిమాండ్ కాదు న్యాయం అని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీలో కొనసాగుతున్న సరే.. తగిన సీట్ల కోసం ఆయా పార్టీల అధిష్టానం పై మాదిగలు తగిన ఒత్తిడి తీసుకురావాలని ఆయన సూచించారు.
మాదిగ మహాశక్తి
ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మాదిగలకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని.. మాదిగ జాతి సముద్దరణ కోసం మాదిగ మహాశక్తి ఏర్పాటు చేశాను.. ప్రతి ఊరు నుంచి కనీసం 50 మంది మాదిగ సోదరులు కలిసి రావాలి… న్యాయం కోసం కలిసి నడుద్దాం.. కలిసి పోరాడుదాం.. కలిసి ఉద్యమిద్దాం.. కలిసి సమిష్టిగా రాజ్యాధికారం కోసం పాటుపడదాం అని నరసింహులు పిలుపునిచ్చారు. 30 ఏళ్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాను.. నా జీవితం మాదిగల సముద్దరణ కోసం అంకితం… బీసీ , ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ తదితర అన్ని వర్గాల కోసం తాను అవిశ్రాంతంగా రాష్ట్రంలో పలుచోట్ల సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నాను.. తన ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదు.. మాదిగ జాతి రాజ్యాధికారం కోసమే అని మోత్కుపల్లి నర్సింహులు స్పష్టం చేశారు. మాదిగలను ఏకం చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చూపెట్టాలన్నదే తన ఆరాటం అన్నారు. మాదిగ మహాశక్తి రాష్ట్రంలో మాదిగలకు రాజ్యాధికారం ద క్కేవరకు కృషి చేస్తుందన్నారు.















