ఈతరం భారతం తిరుపతి జూలై 18 రిపోర్టర్ మనోజ్ కుమార్ :
చంద్రగిరి మండలంలో గుండె తరుక్కుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వైపు వింత రోగాలతో మూగజీవాలు గొర్రెలు, మేకలు విలవిలలాడుతూ కళ్ల ముందే ప్రాణాలు వదులుతుంటే… బాధ్యత గల ప్రభుత్వ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.తొండవాడ, శానంబట్ల పరిసర ప్రాంతాల్లో వరుసగా గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతున్నాయి. జీవాలే ప్రధాన జీవనాధారంగా, వాటిని నమ్ముకునే బతుకుతున్న ఎంతోమంది పేద పశుపోషకులు ఈ రోజు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉన్నపళంగా కళ్లముందే మూగజీవాలు చనిపోతుంటే ఆ పేద కుటుంబాలు ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయాయి. వారి ఆక్రందనలు ఈ అధికారుల చెవులకు వినబడటం లేదా?”
పశుసంవర్ధక శాఖ అధికారులు తక్షణమే స్పందించి, ప్రభావిత పల్లెల్లో అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ సీనియర్ నేత తపసి మురళీ రెడ్డి డిమాండ్ చేశారు. అసలు ఆ మూగజీవాలకు సోకిన ఆ వింత వ్యాధి ఏంటో వెంటనే నిర్ధారించి, దానికి తగిన మందులు, టీకాలు అందించాలని, ఇంకా ఆరోగ్యంగా మిగిలి ఉన్న మూగజీవాలకైనా ఆ వ్యాధి సోకకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
పేద ప్రజల పొట్ట కొడుతూ, మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడితే జనసేన చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా అధికారులు నిద్ర మత్తు వదిలి తక్షణమే స్పందించాలి. లేని పక్షంలో… మూగజీవాల పెంపకదారులను, బాధితులను వెంటబెట్టుకుని ఈ సమస్యను నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మన ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకునేంత వరకు జనసేన పోరాటం ఆపదని ఆయన హెచ్చరించారు.















