ఈతరం భారతం చందుర్తి, జూలై 18:
తెలుగు భాషా సంరక్షణను ధ్యేయంగా చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులను ఒకే వేదికపైకి తీసుకువస్తూ అక్షరాలకు నీరాజనం పలుకుతున్న విశ్వ సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన “గుండెకో వ్యధ” జాతీయ కవితల పోటీలో ప్రముఖ జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు విజేతగా నిలిచారు.డా. పెరుక రాజు కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం ఒక గుండె చప్పుడు. ప్రతి కవిత ఒక మనిషి అంతరంగానికి అద్దం. లోకంలో ఎన్నో రకాల మనుషులు, ఎన్నెన్నో మనస్తత్వాలు ఉంటాయి. కొందరి హృదయాల్లో ఆనందపు అలలు ఎగసిపడితే, మరికొందరి అంతరంగంలో ఎవరికీ చెప్పుకోలేని వ్యథల సముద్రం అలముకుంటుంది. ప్రతి మనిషి వెనుక ఒక కథ ఉంటుంది; ప్రతి కథ వెనుక ఒక వ్యథ దాగి ఉంటుంది.
ఆ వ్యధ కాలం మిగిల్చిన తీరని గాయం కావచ్చు, సమాజం వినని ఆర్తనాదం కావచ్చు, లేక వ్యవస్థను నిలదీసే మౌన ప్రశ్న కావచ్చు. సమాజంలోనూ, మనుషుల మనసుల్లోనూ దాగి ఉన్న అలాంటి అనేక అంతర్మథనాలను, కంటికి కనిపించని వ్యక్తిగత, సామాజిక గాయాలను తన సృజనాత్మక దృష్టితో అక్షరరూపంలో ఆవిష్కరించిన డా. పెరుక రాజు కవిత న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకొని విజేతగా నిలిపింది.
ఈ పోటీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, సాహిత్యాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. అందిన వందలాది కవితలను భావతీవ్రత, కవితా శిల్పం, వస్తు వైవిధ్యం, సాహిత్య విలువలు, సామాజిక స్పృహ వంటి ప్రమాణాల ఆధారంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా శ్రీమతి కె. రమావతి, విశ్వ సాహితీ కళావేదిక చైర్‌పర్సన్ గారు. డా పెరుక రాజు సాహిత్య ప్రతిభను కొనియాడుతూ అభినందన పత్రాన్ని అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాళ్లు గుంటూరు భవాని, అంజలి కుమారితో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక కవితల పోటీలో విజేతగా నిలిచిన డా. పెరుక రాజుకు పలువురు ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు, మిలిటరీ సహచరులు, ఆత్మీయ మిత్రులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.















