ఈతరం భారతం విజయవాడ ఆగస్టు 14 శుక్రవారం
కాశీ వెళ్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసికి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇండిగో సంస్థ ఈ నూతన సర్వీసును ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు వర్చువల్గా సర్వీసును ప్రారంభించారు.
వారణాసి–విజయవాడ మధ్య విమానాలు మంగళవారం, గురువారం, శనివారం నడవనున్నాయి. దీంతో ఇప్పటివరకు ఇతర నగరాల్లో విమానాలు మార్చుకోవాల్సిన ప్రయాణికులకు నేరుగా కాశీ చేరుకునే అవకాశం లభించింది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భక్తులకు మరింత సౌకర్యం కలగనుంది.
ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం
విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసు అందుబాటులోకి రావడం ఆధ్యాత్మిక పర్యాటకానికి మరింత ఊతమిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలకు ఈ సర్వీసు ప్రయోజనకరంగా ఉండనుంది.
ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడంతో పాటు టైర్-2, టైర్-3 నగరాలను ప్రధాన విమానాశ్రయాలతో అనుసంధానించడమే లక్ష్యమని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.















