ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 14 శుక్రవారం
రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జోగుల నర్సయ్యను శుక్రవారం సీపీ కార్యాలయంలో సీపీ సజ్జనర్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత ప్రదర్శించినందుకే అధికారులకు ఈ అత్యున్నత పురస్కారాలు దక్కాయని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించడం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని, వీరి సేవలు ఇతర పోలీసు అధికారులకు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అదనపు డీసీపీ జోగుల నర్సయ్య 1991లో ఎస్సైగా చేరి 35 ఏళ్లుగా సుదీర్ఘ సేవలందిస్తున్నారు. పలు కీలక కేసుల దర్యాప్తు, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గతంలో ఈయన ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (ఐపీఎం) సహా పలు పతకాలు అందుకున్నారు.















