ఈతరం భారతం న్యూఢిల్లీ, నవంబర్ 11:
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ అవార్డును అందుకుంది.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అవార్డును స్వీకరించారు.
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ఈ జాతీయ గుర్తింపు లభించింది. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల శుద్ధి, మురుగునీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల భాగస్వామ్యం వంటి పది ప్రధాన అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో GHMC తన పనితీరును ప్రదర్శించింది.
స్వచ్ఛతలో హైదరాబాద్ ప్రస్థానం..
– 2017లో హైదరాబాద్‌కు ఓడీఎఫ్ హోదా లభించింది.
– 2019లో ఓడీఎఫ్++ హోదా సాధించింది.
– 2021లో తెలంగాణలోనే తొలిసారిగా వాటర్ ప్లస్ సర్టిఫికేషన్ పొందిన స్థానిక సంస్థగా GHMC గుర్తింపు పొందింది.
– 2023, 2024 సంవత్సరాల్లోనూ వాటర్ ప్లస్ హోదాను కొనసాగించింది.
– 2024 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో హైదరాబాద్ 6వ ర్యాంకు సాధించింది.
– 2023లో 5 స్టార్, 2024లో 7 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ గుర్తింపు పొందింది.
10,500 మార్కులతో మూల్యాంకనం..
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో భాగంగా మొత్తం 10,500 మార్కులతో పది ప్రధాన విభాగాల్లో నగరాలను అంచనా వేశారు. కనిపించే పారిశుద్ధ్యం, చెత్త వేరు చేయడం, సేకరణ, రవాణా, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య సదుపాయాలు, వినియోగించిన నీటి నిర్వహణ, పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, పౌరుల అభిప్రాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
మంథని, చేర్యాల మున్సిపాలిటీలకు మెంటార్‌గా GHMC
స్వచ్ఛ షెహర్ జోడీ కార్యక్రమంలో భాగంగా GHMC మెంటార్ సిటీగా మంథని, చేర్యాల మున్సిపాలిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు, సామర్థ్య పెంపు వర్క్‌షాప్‌లు నిర్వహించింది.
2026 ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ జంట నగరాల్లో మూడో పక్షం ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు, చెత్త నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఇంటింటి చెత్త సేకరణతో పాటు ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో GHMCకి జాతీయ అవార్డు లభించడం హైదరాబాద్ నగర ప్రజలకు, అధికారులకు, పారిశుద్ధ్య కార్మికులకు గర్వకారణమని పేర్కొంటూ, నగరాన్ని మరింత పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ గుర్తింపు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు.















