ఈతరం భారతం ఖమ్మం /భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 11:
_____________________________________________
సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపడం.. అసంపూర్తి పనులను పూర్తి చేయడం.. కొత్త ప్రతిపాదనలకు అనుమతులు సాధించడం.. వరద ముప్పు నుంచి పట్టణాలు, గ్రామాలకు రక్షణ కల్పించడంతోపాటు చెరువులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సాగునీటి రంగానికి సంబంధించిన కీలక అంశాలపై రాష్ట్ర సాగునీటి, ఆయకట్టు అభివృద్ధి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సమావేశమై సమగ్రంగా చర్చించారు. రెండు జిల్లాలకు సంబంధించి మొత్తం 15 అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో ఎదురవుతున్న అవరోధాలు, ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అనుమతులు, నిధుల కేటాయింపులు, వరద రక్షణ పనులు, చెరువుల పునరుద్ధరణ తదితర అంశాలను మంత్రి వివరించారు. రైతులకు సాగునీటి సౌకర్యాలు మెరుగుపరచడంతోపాటు ఖమ్మం నగరానికి తాగునీటి భద్రత కల్పించడం, మున్నేరు వరద ముప్పును తగ్గించడం, చెరువులను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
సీతమ్మసాగర్ పనుల పునఃప్రారంభానికి కసరత్తు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యంత కీలకమైన సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు పనులు ఎన్‌జీటీ కేసు కారణంగా నిలిచిపోయిన నేపథ్యంలో వాటిని తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను మంత్రి తుమ్మల ప్రస్తావించారు. పర్యావరణ అనుమతుల సాధన కోసం ఎపిటిఆర్‌ఐ, హైదరాబాద్ ద్వారా ఈ నెల 9న పారివేశ్ పోర్టల్‌లో ప్రతిపాదనలు సమర్పించినట్లు వివరించారు. ఈఏసీ కన్వీనర్ వై.పి.సింగ్‌తో సంప్రదింపులు జరిపి పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన క్లియరెన్సులు సాధించి ప్రాజెక్టు పనుల పునఃప్రారంభానికి మార్గం సుగమం చేయాలని కోరారు.
సీతారామ పనులకు వేగం పెంచాలి
సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన జూలూరుపాడు టన్నెల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే పథకంలోని ప్యాకేజీ-11 పరిధిలో పంప్‌హౌస్-4 నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని వివరిస్తూ, వాటిని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
వెంకమ్మ చెరువు కాలువకు ఆమోదం ఇవ్వాలి
అశ్వారావుపేట నుంచి దబ్బతోగు, ఆసుపాక గ్రామాల్లోని చిన్న నీటిపారుదల చెరువులకు నీరందించే వెంకమ్మ చెరువు వరద ప్రవాహ కాలువ నిర్మాణ ప్రతిపాదనలపై చర్చించారు. ఈ పనులకు రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ మే 11న ఆమోదం తెలిపిందని, సెప్టెంబరు 10న ప్రభుత్వానికి పంపిన ఫైలు పెండింగ్‌లో ఉందని వివరించారు. సంబంధిత ప్రతిపాదనలకు త్వరగా ఆమోదం మంజూరు చేసి పనులు చేపట్టాలని కోరారు.
పెద్దవాగు ప్రాజెక్టుకు శాశ్వత పునరుద్ధరణ
పెద్దవాగు మధ్యతరహా ప్రాజెక్టు వద్ద దెబ్బతిన్న కట్టకు శాశ్వత పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. ఇందుకు సంబంధించిన అంచనాలను 2025 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు. ఈ పనులకు తెలంగాణ రాష్ట్ర వాటాగా రూ.3.40 కోట్లు చెల్లించేందుకు సమ్మతి తెలియజేయాలని ఏపీ ప్రభుత్వం కోరిందని, దీనికి సంబంధించిన ఫైలు తెలంగాణ ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పునరుద్ధరణ పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పైపుల ద్వారా సాగునీటి సరఫరాకు ప్రతిపాదనలు
సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌లోని ప్యాకేజీలు 1, 2, 7, 8 పరిధిలో సంప్రదాయ గ్రావిటీ కాలువలకు బదులుగా ప్రెషరైజ్డ్ పైప్డ్ ఇరిగేషన్ నెట్‌వర్క్ విధానాన్ని అమలు చేసే ప్రతిపాదనలను మంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు అక్టోబరు 17న ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. వీటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేసి పైపుల ద్వారా సాగునీటి సరఫరా వ్యవస్థ నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రిజర్వాయర్లపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రాలు
పీఎం సూర్య సరోవర్ యోజన కింద సాగునీటి రిజర్వాయర్లపై ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థతో కూడిన ఫ్లోటింగ్ సోలార్ ఫొటోవోల్టాయిక్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రూపొందించిన ప్రతిపాదనలను కూడా మంత్రి వివరించారు. వాటిని త్వరగా పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
మరేళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ముందడుగు
మరేళ్లపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి గ్రావిటీ కాలువలు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ ప్రతిపాదనలు ప్రస్తుతం ఇంజనీర్-ఇన్-చీఫ్ స్థాయిలో పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. వీటిని త్వరగా ముందుకు తీసుకెళ్లడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఎంసీఏడీ పథకంలో ఈ ప్రాజెక్టును చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
దోమలవాగు చెరువు సామర్థ్యం పెంపు
బూర్గంపాడు మండలం వేపలగూడెం పరిధిలోని దోమలవాగు చిన్న నీటిపారుదల చెరువు సామర్థ్యాన్ని 0.48 టీఎంసీలకు పెంచేందుకు రూపొందించిన ప్రతిపాదనలను మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలకు త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
మల్లెపులవాగుకు వరద రక్షణ.. భేతుపల్లి చెరువు అభివృద్ధి
మురసు తుఫాన్ నేపథ్యంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొట్టుకపోయిన మల్లెపూల వాగు కట్టలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని, భారీ వరదల నేపథ్యంలో భేతుపల్లి ప్రాజెక్టుకు నీరందించే మల్లెపులవాగుకు శాశ్వత ప్రాతిపదికన రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని మంత్రి వివరించారు. భవిష్యత్తులో వరదల కారణంగా నష్టం వాటిల్లకుండా అవసరమైన రక్షణ పనులు చేపట్టాలని కోరారు. భేతుపల్లి పెద్ద చెరువు సామర్థ్యాన్ని పెంచేందుకు రూపొందించాల్సిన ప్రతిపాదనలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం నియోజకవర్గానికి వరద ముప్పు నుంచి రక్షణ
ఖమ్మం నియోజకవర్గంలోనూ సాగునీటి, వరద నివారణ, చెరువుల అభివృద్ధికి సంబంధించి నాలుగు కీలక ప్రతిపాదనలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాగునీటి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మున్నేరు వరదల నుంచి పరివాహక ప్రాంతాలకు రక్షణ కల్పించే అంశానికి ప్రాధాన్యమిచ్చారు.
ధంసలాపురం వరకు మున్నేరు రక్షణ గోడ
మున్నేరు నదికి వరదలు వచ్చిన ప్రతిసారీ పరివాహక ప్రాంతాలు, నివాస ప్రాంతాలు ముంపు ముప్పును ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధంసలాపురం వరకు రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని మంత్రి కోరారు. నదికి ఇరువైపులా వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన రక్షణ చర్యలు చేపడితే భవిష్యత్తులో వరదల వల్ల ప్రజలు, ఆస్తులకు కలిగే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ మేరకు రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
టేకులపల్లి వద్ద గైడ్‌వాల్ నిర్మాణానికి ప్రతిపాదన
టేకులపల్లి బైపాస్ రోడ్డు సమీపంలో ఎన్‌ఎస్‌పీ కుడి ప్రధాన కాలువకు (ఆర్‌టీ సైడ్) గైడ్‌వాల్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. కాలువ పరిసరాల్లో నీటి ప్రవాహానికి అనుగుణంగా అవసరమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టేందుకు ఈ గోడ నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రతిపాదనను పరిశీలించి నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని కోరారు.
చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక
ఖమ్మం నియోజకవర్గంలోని ధంసలాపురం పెద్దచెరువు, ఖానాపురం ఊరచెరువుతోపాటు ఇతర చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణ పనులు చేపట్టాలని మంత్రి ప్రతిపాదించారు. చెరువుల్లో పూడిక తొలగింపు, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, పరిసరాల అభివృద్ధి వంటి పనులతో వాటిని మరింత వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణతోపాటు వాటి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కోరారు.
లకారం చెరువుకు నీటి మళ్లింపునకు రూ.8 కోట్లతో రెగ్యులేటర్
ఖమ్మం నగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని లకారం చెరువును నింపేందుకు టేకులపల్లి వద్ద రెగ్యులేటర్ నిర్మాణానికి రూ.8 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఈ రెగ్యులేటర్ ద్వారా అవసరమైన నీటిని లకారం చెరువుకు మళ్లించి, నగర తాగునీటి అవసరాలకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఖమ్మం నగర నీటి వనరుల బలోపేతానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఉత్తమ్ సానుకూల స్పందన
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించిన 15 కీలక అంశాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ సమస్యలు, అనుమతులు, ప్రతిపాదనలు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, వరద రక్షణ పనులు, తాగునీటి వనరుల బలోపేతం వంటి అంశాలపై మంత్రి తుమ్మల చూపుతున్న చొరవతో రెండు జిల్లాల్లో సాగునీటి రంగానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలకు ఆమోదం లభించి పనులు కార్యరూపం దాల్చితే రైతులకు సాగునీటి వసతులు మెరుగుపడటంతోపాటు ఖమ్మం నగర తాగునీటి అవసరాలకు మరింత భద్రత లభించనుంది. వరద ముప్పు నుంచి ప్రజలకు రక్షణ కల్పించడంతోపాటు చెరువుల అభివృద్ధికి కూడా మార్గం సుగమం కానుంది.















