EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

16 రకాల ఔషధాల తయారీ, అమ్మకాలు, పంపిణీని పై కేంద్రం నిషేదం

ఈతరం భారతం న్యూ డిల్లి జూన్ 20 :

16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాల తయారీ, అమ్మకాలు, పంపిణీని కేంద్రం నిషేధించింది. ఈ ఔషధాలకు శాస్త్రీయపరమైన ఆధారాల్లేవని నిరూపితమైనట్టు పేర్కొంది. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం, ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, శాస్త్రీయంగా ధ్రువీకరించిన ఔషధాలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడటం కోసమే ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కీలక నిర్ణయం

ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫార్మాస్యూటికల్ పదార్థాలను ఒకే మోతాదులో కలిపి తయారుచేసేవి. ఈ తరహా ఔషధాల వినియోగం, తయారీపై సుప్రీంకోర్టు ఇటీవలే కీలక ఆదేశాలిచ్చింది. దీంతో వివిధ ఔషధాల కలయికలను పరిశీలించి వాటిలో అహేతుకమైనవి, చికిత్సాపరంగా హాని కలిగించే అవకాశం ఉన్నవాటిని గుర్తించడానికి ‘డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు’ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

16 రకాల ఔషధాలపై నిషేధానికి సిఫార్సు

ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాల పనితీరుపై డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ బోర్డుకు చెందిన నిపుణుల కమిటీ సమీక్ష జరిపింది. ఆ తర్వాత చికిత్స మెరుగుదలకు ఎలాంటి ప్రయోజనం లేని 16 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ ఔషధాలపై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు యాంటిబయాటిక్స్‌, టాపికల్‌, కాస్మోటిక్స్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్లను కేంద్రం బ్యాన్‌ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఏముందంటే?

“16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్‌ ఔషధాల తయారీ, అమ్మకం, సరఫరా, పంపిణీపై దేశవ్యాప్తంగా తక్షణమే నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ కాంబినేషన్ డ్రగ్స్‌ వల్ల రోగం నయం అవుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాల్లేవు. నిషేధించిన ఔషధాల్లో కొన్ని చర్మ సంబంధిత మందులు, పెయిన్ కిల్లర్స్, కండరాల నొప్పుల మందులు (యాంటిస్పాస్మోడిక్), యాంటీబయాటిక్స్ ఉన్నాయి” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు

1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్-1940 లోని సెక్షన్ 26ఏ ప్రకారం ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఔషధాల హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి, రోగి భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ చర్య ఒక భాగమని వెల్లడించింది. వివరణాత్మక శాస్త్రీయ సమీక్షల తర్వాత గత కొన్నేళ్లుగా అనేక రకాల అహేతుకమైన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై నిషేధించినట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల డ్రగ్ కంట్రోలర్లు, నియంత్రణ అధికారులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఔషధాల తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర భాగస్వాములకు కూడా చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కేంద్రం నిషేధం విధించిన ఎఫ్‌డీసీ ఔషధాలు ఇవే!

అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్‌ విత్ ఎథోహెప్టాజైన్, డిసైక్లోమైన్, పారాసిటమాల్, క్లిడినియం బ్రోమైడ్ వంటి ఔషధాల కలయికపై కేంద్రం నిషేధం విధించింది. అలాగే గ్లిక్లాజైడ్‌ విత్ క్రోమియం పికోలినేట్, పారాసిటమాల్ కాంబినేషన్‌తో లిగ్నోకైన్ వంటివి ఉన్నాయి. అమోక్సిసిలిన్ విత్ సెర్రాటియోపెప్టిడేస్, సెర్రాటియోపెప్టిడేస్, లాక్టోబాసిల్లస్ స్పోరోజెనస్, సెఫురోక్సిమ్ విత్ సెర్రాటియోపెప్టిడేస్ వంటి అత్యధికంగా వాడే యాంటీబయాటిక్ కాంబినేషన్లపై కూడా నిషేధం పడింది.

విటమిన్-ఈ, జోజోబా ఆయిల్, ఆరెంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్ వంటివి కలిపి తయారుచేసే పలు డెర్మటోలాజికల్ లోషన్లపై కూడా కేంద్రం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అల్లంటోయిన్, డీ-పాంథెనాల్ వంటి పదార్థాల కలయికతో కూడిన అనేక చర్మవ్యాధి, చర్మ సంరక్షణ ఫార్ములేషన్లు కూడా నిషేధం ఎదుర్కొన్న జాబితాలో ఉన్నాయి.

Related News

Select the Topic
Scroll to Top