ఈతరం భారతం న్యూఢిల్లీ నవంబర్ 27 :
దక్షిణ మధ్య రైల్వే భారత ప్రభుత్వం చేపట్టిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇవ్వడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన పరిధిలో గత 31 నెలల్లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద 6.9 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసింది. 2024 ఫిబ్రవరి 13న ప్రారంభించబడిన ఈ పథకం ద్వారా భవనాల పైకప్పులపై సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, తద్వారా సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకోవడమైనది
దక్షిణ మధ్య రైల్వే, ఈ చొరవలో భాగంగా సికింద్రాబాద్ , హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మరియు లాలాగూడ వర్క్‌షాప్‌లోని రైల్వే ప్రాంగణాలలో అందుబాటులో ఉన్న పైకప్పు స్థలాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. వినియోగ స్థానం వద్దే స్వచ్ఛమైన మరియు పునరుత్పాదక శక్తిని ఉత్పత్తి చేయడానికి, అలాగే కార్బన్ ఉద్గారాలను మరియు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి పైకప్పు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. 31 అక్టోబర్ , 2026 నాటికి, సికింద్రాబాద్ డివిజన్ 2.93 మెగావాట్ల (ఎమ్.డబ్లు. పి) పైకప్పు సౌర విద్యుత్ సామర్థ్యాన్ని, హైదరాబాద్ డివిజన్ 2.60 మెగావాట్ల (ఎమ్.డబ్లు. పి) , నాందేడ్ డివిజన్ 0.50 మెగావాట్ల (ఎమ్.డబ్లు.పి) మరియు లాలాగూడ వర్క్‌షాప్ 0.87 మెగావాట్ల (ఎమ్.డబ్లు.పి) సామర్థ్యాన్ని ప్రారంభించాయి. 2030 నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించాలనే భారతీయ రైల్వే లక్ష్యం దిశగా ఈ విజయం ఒక ముఖ్యమైన ముందడుగు. అంతేకాకుండా, ఈ సౌర విద్యుత్ ప్లాంట్లు రైల్వే ప్రాంగణాలలో దీర్ఘకాలిక ఆర్థిక పొదుపునకు కూడా దోహదపడతాయి.
దక్షిణ మధ్య రైల్వే 2024-25, 2025-26 మరియు 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో (2026 అక్టోబర్ 31 వరకు) మొత్తం 31 నెలల కాలంలో 7.32 మిలియన్ యూనిట్ల (ఎమ్.యూ) సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం విశేషం. తద్వారా ఒక అంచనా ప్రకారం 4,963 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలను తగ్గించగలిగింది. అదేవిధంగా, రైల్వే బోర్డు నిర్దేశించిన 4.8 మెగావాట్ల లక్ష్యాన్ని అధిగమించి, 6.9 మెగావాట్ల స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సాధించింది. దక్షిణ మధ్య రైల్వే పర్యావరణహిత, స్వచ్ఛమైన రైల్వే వ్యవస్థ దిశగా తన నిబద్ధతను కొనసాగిస్తూ, అదనంగా మరో 2.5 మెగావాట్ల (ఎమ్.డబ్లు.పి) సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి.
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, పీఎం సూర్య ఘర్ యోజన విజయవంతమైన అమలులో కీలక పాత్ర పోషించిన విద్యుత్ విభాగం అధికారులు, సిబ్బంది చేసిన విలువైన కృషిని అభినందించారు. భారతీయ రైల్వేకు పీఎం – సూర్య ఘర్ ఎక్సలెన్స్ అవార్డు – 2026 లభించడంలో అధికారులు మరియు సిబ్బంది అందించిన విశేష సేవలను ఆయన ప్రశంసించారు. భారతదేశానికి రైల్వే వ్యవస్థ జీవనాడి వంటిదని, పర్యావరణహితమైన, స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను నిర్మించాల్సిన బాధ్యత కూడా రైల్వేలపై ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛమైన, హరితమైన, మెరుగైన భారతదేశ నిర్మాణానికి దోహదపడేలా సుస్థిర ఇంధన విధానాలను అవలంబించడం ఎంతో అవసరమని జనరల్ మేనేజర్ స్పష్టం చేశారు.















