ఈతరంభారతం అమరావతి మార్చి 29
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ‘మూడు రాజధానుల ముక్కలాట’కు ముగింపు పలికామని, ఇకపై రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి వెలుగుతుందన్నారు.తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాన్య ప్రజల పక్షాన ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సాధారణ కార్యకర్తలను సైతం చట్టసభలకు పంపిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి, వారిని రాజకీయంగా బలోపేతం చేసిన మొదటి పార్టీ తమదేనని ఆయన గుర్తు చేశారు.ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తాము తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు నేడు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చంద్రబాబు పేర్కొన్నారు. అదే విజన్ తో అమరావతిని అభివృద్ధి చేస్తామన్నారు. “హైదరాబాద్ కంటే మెరుగైన, అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాజధానిగా అమరావతిని నిర్మిస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.



