EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఊరట

ఈతరం భారతం అమరావతి ఏప్రిల్ 10

ప్రముఖ నటుడు మోహన్‌బాబు కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, తుది నిర్ణయాన్ని ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.తిరుచానూరు పోలీసులు నమోదు చేసిన ఈ కిడ్నాప్ కేసులో ఇరువర్గాల లాయర్లు తమ వాదనలను బలంగా వినిపించారు. మోహన్‌బాబుకు కిడ్నాప్‌కు సంబంధం లేదని .. ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చారని ఆధారాలను కోర్టుకు సమర్పించారు. యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బ తీసేలా కొందరు ఇలా చేస్తున్నారని.. మోహన్‌బాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.

అయితే ఈ కిడ్నాప్ కేసులో మోహన్‌బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయని పోలీసుల తరఫున లాయర్ కూడా వాదించారు. మోహన్‌బాబు కిడ్నాప్ జరిగిన సమయంలో యూనివర్శిటీకి సంబంధించిన సిబ్బందితో మాట్లాడినట్లు ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లు ఉన్నాయన్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించొద్దని కోరారు. అలాగే ఈ కేసులో ఏ3గా ఉన్న మంచు విష్ణుకు నోటీసులు విచారణకు పిలిస్తే రాలేదని కూడా కోర్టుకు తెలిపారు. ఈ వాదనల తర్వాత కోర్టు బెయిల్‌పై ఈ నెల 16న తీర్పును ఇవ్వనుంది.

జరిగిందేమిటి…

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ నిర్వహిస్తున్నారు. కాగా వర్సీటీలో యాజమాన్యం విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ యూనివర్సిటీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో దర్నాకు వెళుతున్న విద్యార్థి సంఘం నేతలు వినోద్, అక్బర్లను మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన బౌన్సర్లు కిడ్నాప్‌ చేసి బలవంతంగా ఎత్తుకెళ్లారు. అనంతరం వారిని నిర్భంధించి బెదిరించారు. ఈ విషయమై మరో విద్యార్థి సంఘం నేత తిరుపతి పోలీసులను ఆశ్రయించాడు.

 

 

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. విద్యార్థి సంఘం నేతల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బౌన్సర్ల ఆధీనంలో ఉన్న విద్యార్థి సంఘం నేతలను పోలీసులు రక్షించారు. బౌన్సర్లతోపాటు వారి వాహనాలను సీజ్‌ చేసి తిరుపతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మోహన్ బాబుతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హై కోర్టులో విచారణ సాగుతోంది.

Related News

Select the Topic
Scroll to Top