పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలకు వేల కోట్ల రూపాయల రుణాలను రైట్ ఆఫ్ చేసిన దేశ పాలకులు సైతం ఉచిత పథకాలను విమర్శిస్తున్నారు. తమకు అందని ఉచిత పథకం ఏదైనా వృథానే అనిపించడం మాములే కానీ ఉచిత పథకాలు తెలంగాణ గ్రామీణ స్వరూపాన్ని మార్చేశాయి. దళిత బంధు, రైతు బంధు, పెన్షన్లు, చేపలు, బర్లు, గొర్రెలు వంటి ఈ పథకాలన్నీ కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో అప్పటి కలెక్టర్ ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించి, కొంత కాలం తరువాత ఆ గ్రామంలో మార్పులపై అధ్యయనం చేయించారు. సురక్షితమైన నీటి వల్ల ఆ గ్రామంలోని కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ఎలా అంటే అంతకు ముందు తాగునీళ్లు బాగా లేక తరుచుగా రోగాల పాలు అయ్యేవారు. రోగం వచ్చినప్పుడు వైద్యానికి ఖర్చు, దీనికి తోడు కూలీ పనికి డుమ్మా. దానితో ఆదాయం పడిపోయేది. సురక్షితమైన నీటి వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయమూ పెరిగింది. తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ మంచినీరు సరఫరా ప్రభావం.. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరుగుదలపై ఉంది. మేధావుల విమర్శలు, సన్నాయి నొక్కులు ఎలా ఉన్నా, తెలంగాణ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. మరిన్ని ఉచిత పథకాలు వస్తాయి. మరింత ఆదాయం పెరుగుతుంది. ఇది ఖాయం.గతంలో సిరిసిల్ల ప్రాంతంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు బాధ కలిగించేవి. బతుకమ్మ చీరలు వారి జీవితాలను మార్చేశాయి. బతుకమ్మ చీరల్లో రాజకీయం చూసే వారు చీరలను తగలబెట్టి మురిసిపోవచ్చు కానీ చేనేత కార్మికుల్లో, పేదల్లో ఆ చీరలు కలిగించే ఆనందం చూసే వారికి తెలుస్తుంది.