EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎట్ట‌కేల‌కు గ్రూప్-2 ఎగ్జామ్‌ వాయిదా

ఎట్ట‌కేల‌కు గ్రూప్-2 ఎగ్జామ్‌ వాయిదా

హైద‌రాబాద్ జూలై 19 (ఈతరం భారతం); : నిరుద్యోగుల ఉద్య‌మానికి రేవంత్ స‌ర్కార్ త‌ల‌వంచింది. ఎట్ట‌కేల‌కు గ్రూప్-2 ఎగ్జామ్‌ను వాయిదా వేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వ‌హించాల్సిన గ్రూప్-2 రాత‌ప‌రీక్ష‌ను డిసెంబ‌ర్‌కు వాయిదా వేస్తూ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. డిసెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న గ్రూప్-2 రాత‌ప‌రీక్ష‌ల తేదీల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.గ్రూప్-2 వాయిదాతో పాటు పోస్టుల సంఖ్య పెంచాల‌ని గ‌త నెల రోజులుగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టీజీపీఎస్సీ కార్యాల‌యాన్ని ముట్ట‌డించి త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీంతో పాటు ఉస్మానియా యూనివ‌ర్సిటీ, అశోక్‌న‌గ‌ర్, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో నిరుద్యోగులు ప‌లు ర‌కాలుగా నిర‌స‌నలు వ్య‌క్తం చేశారు. నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌ల్లో పాల్గొన్న నిరుద్యోగుల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపి లాఠీలు ఝుళిపించారు.ఇటీవ‌లే అశోక్‌న‌గ‌ర్‌లో అర్థ‌రాత్రి వేళ భారీ నిర‌స‌న చేప‌ట్టి కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిన‌దించారు. తెలంగాణ స‌చివాల‌యం ముట్ట‌డికి కూడా నిరుద్యోగులు పిలుపునివ్వ‌డంతో.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న‌లో ప‌డింది. మొత్తానికి నిరుద్యోగుల ఉద్య‌మం ఫ‌లించింది.

పోస్టోపోన్ వ‌ర‌కేనా..? పోస్టులు పెంచుతారా..?

మొత్తం 783 పోస్టుల భ‌ర్తీకి గ్రూప్-2 నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ పోస్టుల‌కు 5.51 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వాయిదాతో పాటు పోస్టులు కూడా పెంచాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 2 వేల పోస్టులు అద‌నంగా పెంచాల‌ని నిరుద్యోగుల డిమాండ్. మ‌రి పోస్టులు పెంచుతారా..? లేదా అనే దానిపై అనుమానం ఉంద‌ని నిరుద్యోగులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top